Migration!

9:11 ఉద. వద్ద మే 18, 2009 | Uncategorized లో రాసారు | 1 వ్యాఖ్య

నాకు విసుగొచ్చేస్తోంది ఇలా రెండు బ్లాగులు పెట్టుకోడం, ఈ రెండో దాన్ని అనాథ ప్రేతంలా చూడ్డమూ.

అందుకే, దీన్ని కూడా నాలోకి..అదే నా అసలు బ్లాగులోకి కలిపేస్తున్నా ఇవాళ నుంచి. ఈ బ్లాగులోని టపాలన్నీ మీరు…చూసే ఆసక్తి ఉంటే : ఇక్కడ చూడవచ్చు.

– ఇట్లు భవదీయురాలు, నేను.

ప్రకటనలు

“మాలపల్లి” నవలలోని ఒక సంభాషణ

11:00 ఉద. వద్ద నవంబర్ 17, 2008 | General లో రాసారు | 7 వ్యాఖ్యలు

నేను ఉన్నవ లక్ష్మీ నారాయణ గారి “మాలపల్లి” చదువుతూ ఉంటే, ఒక సంభాషణ నన్ను బాగా ఆకర్షించింది. దాన్ని యధాతథంగా ఇక్కడ టైప్ చేస్తున్నాను:

జోతి: అమ్మా! రేపెక్కడికే అయ్యా, నీవు పోవడం
వెంకటదాసు: ఎక్కడకా? దేవుడి దగ్గరకు
జో: దేవుడు తన దగ్గరకి మిమ్ములని రానిస్తాడా?
మాలక్ష్మి: ఆ,ఆ. దేవుడు రానిస్తాడు.
జో: ఇక్కడి దేవుడి గుడిలోకి మనలను రానీయరేమి?
మా: రానీయకపోతే వాళ్ళే చెడ్డారులే! మీ అన్న మనకు దేవుడి గుడి కట్టిస్తున్నాడుగా
జో: మన గుడిలోకి వస్తాడా దేవుడు?
మా: ఆహా! ఎవరు కట్టించుకున్నా వస్తాడు. ఆయనకంటు లేదు.
రామదాసు:పెద్దదేవుడు మనలోనే ఉంటే ఈ రాతి దేవుళ్ళెందుకు? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా? అన్నారు.
వెం: నీదంతా అద్వయితం. అంతా నీవంత వాండ్లయితే దేవుడి గుళ్ళక్కరలేదు. మేమంతా ముక్కులు మూసుకుని కూర్చుంటామా ఏమి?

– ఈ ఒక్క సంభాషణలోనే నాకు “దేవుడు” గురించిన రకరకాల కోణాలను స్పృశించినట్లు అనిపించింది. జోతిది అమాయకత్వం, రామదాసుది “సత్యమే శివం” లో కమల హాసన్ పక్షం తరహాది. మాలక్ష్మిది దేవుడికి అందరూ సమానమే అన్న భావం, వెంకటదాసుది దేవుడికి, తనవారు దేవుణ్ణి చూడటం కోసం గుడి కట్టించాలన్న తాపత్రేయం. నాకెందుకో ఈ సంభాషణ చూడ్డానికి సింపుల్గా ఉన్నా కూడా, చాలా చాలా ప్రభావితం చేసేదిగా అనిపిస్తోంది.

ఇదే మూసలో ఉన్న మరో డైలాగు : “పస్తులుంటే దేవుడు మీకు పుణ్యమిస్తాడట. ఆ దేవుడు దినపస్తులుండే మాకెందుకియ్యడో!”

రెండు వార్తలు

9:10 ఉద. వద్ద ఆగస్ట్ 27, 2008 | General లో రాసారు | 6 వ్యాఖ్యలు

మొన్నాదివారం నాటి ఈనాడులో వచ్చిన వార్తల్లో రెండు వార్తలు చూసాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. మొదటి వార్త కాస్త నవ్వు తెప్పించింది. రెండవది కాస్త ఆలోచింపజేసింది. రెండు వార్తలూ పేజీలో చూడొచ్చు.

మొదటిది: “ద్విచక్ర వాహనం వెనుక సీటుపై చీరకట్టుతో ప్రయాణం వద్దు! ఒకవైపు కూర్చోవడం వల్లే ప్రమాదాలు: కేరళ హైకోర్టు”
ఇది కాస్త నవ్వు తెప్పించింది. అంటే, చీర కట్టుకుంటే ద్విచక్రవాహనాలు ఎక్కకూడదు అనమాట. అసలుకైతే, కేరళ హైకోర్టు అన్నది – ఒకవైపుకి కూర్చుని ప్రయాణం చేయకూడదని. దానికి అర్థం ఇదే కనుక ఈనాడు ఇదే హెడ్‍లైన్ చేసేసింది :)) కనీసం దక్షిణ భారద్దేశం లో చీర అన్నది చాలా కామన్ గా కనిపిస్తుంది. యువతులను, పిల్లలను పక్కన పెడితే, తక్కినవారందరూ చాలావరకూ చీరే వేసుకుంటు ఉంటారు. కార్లవాళ్ళని వదిలేస్తే, చాలా వరకు మధ్యతరగతి జీవులకు ద్విచక్ర వాహనాలే ఉంటాయి. భార్యా-భర్తా స్కూటర్ మీద వెళ్ళడం, ఒక్కోసారి పిల్లలతో వెళ్ళడం – ఇదంతా చిన్నప్పట్నుంచీ చూస్తున్న విషయమే. ఇలా కూర్చోడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి? మొత్తం యాక్సిడెంట్లలో అది ఎంత శాతం? జరిగినవి కూడా ఒక వైపుకి కూర్చోడం అన్న ఏకైక కారణం వల్ల జరిగాయా? అన్న వివరాలు కూడా తెలిపి ఉంటే, చూసి తెలుసుకుని తరించి ఉండేవాళ్ళం. నిజానికి ఒకవైపుకి కూర్చుంటే దూకేయడం ఈజీకదా… ఆ లెక్కన, వాళ్ళు బతికిపోవాలి కదా! 😉 లేదంటే, ఇదంతా విధి ఆడిస్తున్న వింత నాటకమేమో. ఆటోవారి బాగు కోసం కోర్టు తాపత్రేయమేమో. లేకుంటే, కారు డీలర్ల కోసమో! లేకుంటే, చీరని మరుగున తోయడానికేమో! ఆడవారిని బండి నడపడానికి ప్రోత్సహించడానికేమో. టూవీలర్ల సేల్స్ డబల్ చేయడానికేమో! లేదంటే, ఇవన్నీ కాకుండా ఆడవాళ్ళని రాతియుగంలోకి, వంటింట్లోకి మళ్ళీ తరిమేయడానికేమో!! లోగుట్టు కేరళ హైకోర్టుకే ఎరుక.

రెండవది: “కల్యాణ మండపం నిబంధనే అమ్మాయిని కాపాడింది!”
ఒక కల్యాణమండపంలో నిబంధన ఏమిటీ అంటే, అక్కడ పెళ్ళి చేసుకోబోయే వధూవరులు తప్పనిసరిగా హెచ్‍ఐవీ పరీక్షలు చేసుకోవాలని. దీని కారణంగా పీటల దాకా వచ్చిన ఓ పెళ్ళి నుండి ఓ అమ్మాయి బయటపడింది, వరుడికి హెచ్‍ఐవీ పాజిటివ్ అని తేలడంతో. ఈ వార్త చదివాక అన్ని కల్యాణ మండపాల్లోనూ ఇలాంటి నిబంధన ఉండాలా? అన్న ఆలోచన వచ్చింది. హెచ్‍ఐవీ ఉందన్న సంగతి ఆ వరుడికి తెలిసే పెళ్ళికి సిద్ధమయ్యాడో లేక తెలీక చేసాడో అన్నది అనుమానంగానే ఉంది కానీ, తెలిసి సిద్ధమైన కేసుల్లో ఇలాంటి స్కీము బాగా పనికొస్తుంది. కానీ, ఇంతదాకా వచ్చాక (ఈ పెళ్ళి ముహుర్తానికి కొన్ని గంటల ముందే ఫలితం తెలిసింది) పెళ్ళి చెడితే కలిగే ఎమోషనల్ స్ట్రెస్ కంటే ముందే ఈ టెస్టులేవో చేసుకోడానికి ముందుకు వచ్చి ఉండొచ్చు కదా అనిపించింది. కానైతే కల్యాణ మండపం వారి ఆలోచన మాత్రం మెచ్చుకోదగ్గదిగా అనిపించింది.

నికేతా మెహ్‌తా కేసు

9:23 ఉద. వద్ద ఆగస్ట్ 8, 2008 | Incidents లో రాసారు | 2 వ్యాఖ్యలు

నిన్న కాసేపు నికేతా మెహ్తా కేసు గురించి చదువుతూ ఉన్నాను. మొదట దీనిపై ఆసక్తి కలిగించింది The Statesman దినపత్రిక లో నిన్న వచ్చిన వ్యాసం. తరువాత Times of India ఆన్లైన్ వ్యాసాలు చదివాక ఈ ఉదంతం పై నా టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. ఈ కేసు గురించి వివరంగా రాయబడ్డ బ్లాగు టపా ఇక్కడ.

క్లుప్తంగా చెప్పాలంటే, నికేతా మెహ్‌తా తనకి పుట్టబోయే బిడ్డకి గుండె జబ్బు ఉండే ప్రమాదం ఉందనీ, పుట్టిన క్షణం మొదలుకుని జీవితాంతం పేస్‌మేకర్ వాడాల్సిన అవసరం వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలిసి తనకి అబార్షన్ కి అనుమతినివ్వాలని కోర్టును కోరింది. మన దేశపు చట్టాల ప్రకారం ఇరవై వారాలలోపే అబార్షన్ చేసుకోవాలట. కానీ ఈవిడకి ఇరవై నాలుగు వారాలకి ఈ విషయం తెలిసింది కనుక కోర్టుని చేరింది విషయం. హైకోర్టేమో ఆమె తరపు వాదన తోసిపుచ్చింది. ఈ అబార్షన్ చట్టసమ్మతం కాదు అని తేల్చింది.

ఈ కేసు ఫలితం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నిజానికి. ఓ పక్క ఆ పుట్టబోయే బిడ్డ కి జీవితాంతం బాధలు పడే అవకాశాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అబార్షన్ కి, అదీ తల్లిదండ్రులు కోరుతున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అని. అబార్షన్ నేరమా? ఘోరమా? తప్పా? ఒప్పా? అన్న మీమాంస కాదు ఈ టపా. ఈ కేసు విషయం లో ఏది న్యాయం అన్న చర్చ కోసం. మామూలుగా అబార్షన్ నేరం అనుకున్నాకూడా, ఇలాంటి కేసుల్లో ఇప్పుడు నేరం చేస్తే ఓ జీవితాన్ని జీవితాంతం చస్తూ జీవించే యాతన నుండి తప్పించవచ్చు కదా? ఈ కేసులో ఒక వాదన ఏమి రావొచ్చు అంటే – “ఒకవేళ ఇవేమీ లేకుండా బిడ్డ మామూలుగానే పుడితే…అప్పుడీ అబార్షన్ ఆ బిడ్డని చంపేసినట్లే కదా?” అని. కానీ, అది ఖచ్చితంగా చెప్పలేనప్పుడు, శిశువు గుండెజబ్బుతో పుట్టే అవకాశం ఉన్నప్పుడు – ఆ లాజిక్ పని చేస్తుందా? జబ్బుతో పుట్టిన బిడ్డ తో తల్లిదండ్రుల జీవితం, పుట్టిన శిశువు జీవితం, వీళ్ళలో జరిగే మానసిక సంఘర్షణా – ఇవన్నీ ఆలోచిస్తే మరి?

తొమ్మిదేళ్ళ వయసు నుండి పేస్‌మేకర్ వాడుతున్న ఓ ముప్ఫై ఐదేళ్ళ మనిషి కథనం ప్రకారం జీవితాంతం దానిపై ఆధారపడి బ్రతకాల్సిన మనుషులు కూడా మామూలు జీవితం గడపొచ్చట.ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ట్రీట్ చేయొచ్చని అతను అన్నాడు. ఈ విషయం బానే ఉంది వినడానికి. అయితే, తెలిసి తెలిసీ…. అన్న భావన ఆ తల్లిదండ్రుల్లో రావడంలో నాకేమీ అసహజత్వం కనబడ్డం లేదు. పైగా, పేస్‌మేకర్ ట్రీట్‌మెంట్ ఖర్చుతో కూడుకున్నదట. జీవితాంతం ఆ ఖర్చు భరించే స్థోమత తల్లిదండ్రులకి ఉండాలి కదా.

“”But I will have to now stop working. We are not that rich to afford full-time nannies. Finances will certainly be one concern.”

-అన్న మాటల్ని బట్టి చూస్తే నికేతా దంపతుల అసహాయత అర్థమౌతోంది కదా. దానికి జవాబు గా బోలెడు సంస్థలు ముందుకొస్తున్నాయి, ప్రభుత్వం సాయం చేస్తుంది జీవితాంతం – వంటి వాదనలు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఇప్పుడిస్తున్న వాగ్దానాలే-వేటికీ గ్యారంటి లేదు అన్నది ఒక విషయమైతే, ఇలా ఎన్ని కేసులకని సాయం చేస్తారు? అన్నది మరో విషయం. ఈ కేసు తరువాత తమకి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్న కేసులు ఎక్కువైపోయాయంట కాబోయే తల్లిదండ్రుల్లో. ఈ విషయానికి సంబంధించి ఉపయోగపడే రకరకాల టెస్టుల గురించిన సమాచారం ఇక్కడ.

మన అబార్షన్ చట్టాల ప్రకారం 26 వారాల తర్వాత తల్లి కి ప్రమాదమైనప్పుడు అబార్షన్ చేసుకునే సౌలభ్యం ఉందట కానీ, బిడ్డ పరిస్థితి బాలేకపోతే కాదట. ఇది మరో వింత నాకు. ఏం? పుట్టాక ఆ బిడ్డ మాత్రం మనిషి కాదా? అలా అబార్షన్ ఆపాక పుట్టిన శిశువు ఏదో కారణానికి మరణిస్తే మాత్రం ఆ తల్లికి క్షోభ కలగదా?

పుట్టబోయే బిడ్డ పుట్టాలా వద్దా అన్న విషయం లో తల్లి అభిప్రాయానికి విలువ లేదా? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మానసిక పరిస్థితి ఏమిటి? వంటివి మరిన్ని ప్రశ్నలు. అసలు బాధ్యత గల ఏ తల్లీ కారణం లేకుండా తనకి పుట్టబోయే బిడ్డను చంపాలనుకోదు అన్నది మరొక పాయింటు.  అబార్షన్ గురించి తల్లికి కొంత స్వేఛ్ఛ ఉండాలని నా అభిప్రాయం. పెంచడానికో, పుట్టించడానికో తల్లికి ఒకవేళ వ్యతిరేకత ఉంటే, ఆమెని ఆమె తాలూకా మనుషులు ఒప్పించలేకపోతే…బలవంతంగా కోర్టు బిడ్డని పుట్టనిచ్చాక ఆ బిడ్డ పరిస్థితి సాఫీగా ఉండాలనేముంది? నికేతా కేసు గురించి కాదు ఇది అంటున్నది. ఆ కేసులో కారణాలు వేరు. ఆ కేసులో నేనైతే నికేతాకే ఓటు వేస్తున్నాను. ఇప్పుడు చెప్పింది more general context.

“”But what is disappointing is that we have been proved to be fools. We are educated fools. People in remote areas go to quacks for an abortion. The lesson here being sent out is: don’t follow the law. We are being punished for being law-abiding citizens.” -అన్న మాటల్లో అర్థమౌతున్నాయి నికేతా మెహ్‌తా ఈ కేసు విషయం లో అనుభవించిన క్షోభా, ఫలితం ఆమెలో కలిగించిన అసంతృప్తీ. “We have initiated awareness about the abortion law and that it needs to change with time and changing societal standards and medical advances,’’  – అన్నప్పుడు కాస్త ఆశాభావం కూడా కనిపించింది. (మూలం)

సందీప్ పాండే గురించి

10:45 ఉద. వద్ద ఆగస్ట్ 5, 2008 | People లో రాసారు | 1 వ్యాఖ్య

సందీప్ పాండే ఎవరు? అన్న ప్రశ్న నుండి మొదలుపెడితే, ఆయన Asha Foundation వ్యవస్థాపకుల్లో ఒకరు. 2002లో రామన్ మెగసేసే అవార్డు గ్రహీత. భారద్దేశానికి చెందిన వారిలో అందరికంటే చిన్న వయసులో ఈ అవార్డు పొందిన వ్యక్తి. Active social activist. ఆయన కార్యరంగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్. వ్యక్తిగత విషయాలకొస్తే, UC-Berkeley లో Mechanical Engineering లో PhD చేసారు. తరువాత రెండేళ్ళు IIT-Kanpur లో పని చేసి, 1993 లో పూర్తి స్థాయి సమాజ సేవకుడిగా మారిపోయారు.

నిన్న రాత్రి IIIT లో ఆయన ప్రసంగం ఉండింది. మాకొచ్చిన మెయిల్ సారాంశం ఇదీ:

Dr Sandeep Pandey will talk about his experiences as a social
activist in the rural areas of Uttar pradesh. He will touch upon
the themes of Right to Information, Right to Food, Right to Work,
Right to Education, Harmony in community, Nuclear disarmamemt,
Peace and Anti-Globalisation.

ఆయన గురించి చెప్పడానికి చాలానే ఉంది నిజానికి. అంతా ఈ చిన్న టపాలో కూర్చాలనుకోవడం మరీ అతి చేయడమే. అందుకని, నేను చెప్పదలుచుకున్నవి మాత్రం చెబుతాను. 🙂 ఇంతకీ, కాలేజీ లో ప్రసంగం లో RTI అని మొదలైనా కూడా, అణు ఒప్పందం, SEZs, Social inequality, poverty వంటి విషయాలు మొదలుకుని Globalisation, Over-population దాకా ఎన్నో విషయాల మీద సాగింది. విన్నవారి ప్రశ్నలని బట్టి ప్రసంగం రూటు మారుతూ వచ్చింది. వింటున్నంత సేపూ నన్ను ఆకట్టుకున్నది ఆయన లో ఉన్న simplicity. చెప్పదలుచుకున్నది స్పష్టంగా, సూటిగా చెప్పడం, చెప్పిన దానిపై ఎక్కడా నమ్మకం సడలకపోవడం. ఆయన చెప్పినవన్నీ నాకు నచ్చాయని కాదు. కొన్ని చోట్ల మరీ idealist లాగా అనిపించాడు. కొన్ని చోట్ల పూర్తి ఆధునికతకి వ్యతిరేకిలా అనిపించాడు. అయినప్పటికీ కూడా, సామాజిక విషయాలపై ఓ సమాజ సేవకుడి మాటలు, అదీ ఈ స్థాయి వ్యక్తి మాటలు లైవ్ వినడం నాకు ఇదే మొదటి సారి. తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉండింది. అణుఒప్పందం గురించి ఇప్పటిదాకా చదవని point of view ని ఆయన Buddha weeps in Jadugoda అన్న కథలో చెప్పారు. ప్రస్తుత అణుఒప్పందం పై ఈ కోణంలో ఇప్పటిదాకా పేపర్లలో అయితే చదవలేదు నేను. వేరే context లో ఈ విషయాల గురించి చదివినా కూడా. పాండే గారి వివరణలు ఈ విషయంలో వారి పరిశోధనని గురించి చెప్పాయి. RTI ఎలా మొదలైంది అన్న కథ కూడా నచ్చింది నాకు.

పొద్దున్న ఆయనదే ఒక వీడియో చూసాను. ఇది ఒక అరగంట సాగే ఆయన ఇంటర్వ్యూ. వివిధ విషయాల మీద ఆయన అభిప్రాయాలు. ఇక్కడ కూడా నాకు నచ్చింది ఇదే. ఆయన లో ఉన్న స్పష్టత, simplicity. చెప్పిన విషయాలన్నీ మనం ఒప్పుకుంటామా లేదా అన్నది వేరే విషయం. ఒక మనిషికి తాను చేస్తున్న పని సరైనదని పూర్తి నమ్మకముంటే, అది ఎలా ఉంటుందో పాండే మాటల్లో తెలుస్తోంది నాకు 🙂 ఒక విధంగా నిన్నటి ప్రసంగం నాకు నిరాశే కలిగించి ఉండాలి. కానీ, Sandeep Pandey – the man గురించి కాస్త ఎక్కువ తెలుసుకునే అవకాశం కల్పించింది కనుక, క్షమించేస్తున్నా 😉

Rosy గారితో కాసేపు

11:16 ఉద. వద్ద మార్చి 20, 2008 | People లో రాసారు | 6 వ్యాఖ్యలు

నాకూ, ప్రశాంతికి మధ్య జరిగిన ఓ ఆన్లైన్ సంభాషణ లో రోసీ గారి గురించి తెలిసింది. చందానగర్ లో ఒక స్లం ఏరియా లో ఓ స్కూలు పెట్టి (ఫుల్ టైం స్కూల్) నడుపుతున్నారు అని. నాకు కాలేజీ నుండి దగ్గరే కదా, అని ఆవిడ కాంటాక్ట్ డీటైల్స్ సంపాదించి ఈరోజు కలిసాను. కలిసి వచ్చాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. ఆవిడ ప్రచారం ఇష్టం లేదన్నది కానీ, నా ఉద్దేశ్యం లో మంచి పని చేసేవాళ్ళ గురించి ఇతరులకి చెప్పడం లో తప్పు లేదు. పైపెచ్చు, స్పూర్తి కూడా కలిగిస్తారు వాళ్ళు.

ఇంతకీ, నేను చందానగర్ స్టేషన్ దగ్గర కలుస్తా అని చెప్పాను. దానికి వచ్చే దారిలోనే అర్థమైంది అక్కడి మనుష్యుల living standards. స్టేషన్ దగ్గర పాపిరెడ్డి కాలనీ అని ఉంది. అక్కడ కాస్త నయం… పక్కా ఇళ్ళూ అవీ కనిపించాయి. ఇంతకీ ఆమెని కలిసాను. తర్వాత, వాళ్ళ స్కూలుకి తీసుకెళ్ళారు. ఆ కాలనీ లోనే కాస్త ముందుకెళితే, SVN school అని కనిపించింది. శారదా విద్యా నికేతన్ అట పూర్తి పేరు. స్కూల్లో నలభై మంది పిల్లలు. అందరూ ఇదివరలో కాగితాలేరడమో, అడుక్కోవడమో చేసిన పిల్లలే. ఒకరిద్దరి నుండి వారి కథలు కూడా విన్నాను. ఈ స్కూల్లో ఓ మానసిక వికలాంగుడైన అబ్బాయి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ మొదట స్కూల్లో చేరక ముందు ఎలా ఉండేవారు? ఇప్పుడెలా ఉన్నారు? అన్నది రోజీ గారు చెబుతూ ఉంటే ఆశ్చర్యమేసింది.

ఇది కాక ఓ అనాథ శరణాలయం కూడా నడుపుతున్నారు ఈమె. దానికి నేను వెళ్ళలేదు..కనుక దాని వివరాలు పెద్దగా తెలీవు.

ఇది మా  ఆషాకిరణ్ మాదిరి కాదు. ఫుల్-టైం బడి. కనుక, పిల్లల మీద మరింత శ్రద్ధ పెట్టవచ్చు. ప్రస్తుతమున్నది అద్దె భవనం. త్వరలో సొంత భవనం కట్టుకోగలం అన్నది ఆమె ఆశ. ఇంతకీ, వింత ఏమిటీ అంటే, అక్కడ చెప్పుకోదగ్గ ఫండింగ్ అంటూ రెగులర్ గా ఏదీ లేదు. ఆమె, కుటుంబ సభ్యులే దీనికి మహారాజ పోషకులు. అంటే, వాళ్ళేదో మహా వీర ధనవంతులని కాదు. వాళ్ళకి ఉన్న దానిలోనే ఇదంతా చేస్తున్నారు. ఇటీవలే applabs వాళ్ళు వచ్చి నోట్ బుక్స్ అవీ ఇచ్చారట స్కూలుకి. ఆవిడ ద్వారా ఆ కాలనీ వాసుల జీవితాలూ…వారి కష్ట నష్టాల్లోకి తొంగిచూడగలిగాను. నాకు బయటి ప్రపంచం తో అందునా, ఆ తరహా ప్రపంచం తో సంబంధాలు తక్కువే. కనుక, నాకు వాళ్ళ గురించి చెప్పడం ద్వారా సమాజం లో నేనూ ఉన్నా కనుక సమాజానికి నేనూ ఏదో చేయాలి అని మళ్ళీ గుర్తు చేసిన రోజీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోను?

ఇది ఇంట్రో టపా. మరో కొద్ది రోజుల్లో మరో టపా వివరంగా రాస్తాను ఈ ట్రిప్ గురించి.

Motivation for the day :)

6:56 ఉద. వద్ద మార్చి 18, 2008 | General లో రాసారు | 3 వ్యాఖ్యలు

ఏదో ఓ చిన్న మంచి పని(అదే…మనం మంచి అనుకున్నది..) చేస్తాము. అది ఎవరికో ఎక్కడో ఓ చోట మేలు కలిగిస్తుంది. మనం ఆనందిస్తాం. వాళ్ళూ ఆనందిస్తారు. అది ఈ వ్యవహారాన్ని చూసే ఒక కోణం.
మరో కోణం, కాస్త సినికల్ కోణం – “నువ్వొక్కదానివి ఏదో చిన్న పనిచేస్తే? ఏమౌతుంది? ఏమన్నా తేడా ఉంటుందా వాళ్ళ జీవితాల్లో?”.
ఇంకో కోణం – “ఇలా చిన్న చిన్న పనులు చేయడం కాదు. ఏదో చేయాలి…. అది నిజమైన పెద్ద మార్పు తీసుకురావాలి.” (దీన్నే enterpreneurship కోణం అంటాను నేను.)
ఇక, రెండో కోణం ని చూస్తే, ప్రతి ఒక్కరూ అంత నిరాశగా ఉండరు. మూడో కోణం చూస్తే, ప్రతి ఒక్కరూ అంత పనిమంతులై కూడా ఉండరు. ఎవరికి చేతనైన విధంగా వారు చేద్దామని అనుకుంటారు. (అసలు నాకెందుకు? నేను బాగున్నా కదా! అనేసుకుంటే అసలీ టపా మీక్కాదు…:) సమస్యే లేదు అలా అనుకుంటే మీకు…)
మొదటి రకం వాళ్ళని ప్రోత్సహిస్తే మూడోరకం లోకి మారినా మారొచ్చు. చెప్పలేం. అసలీ సుత్తంతా ఎందుకు చెబుతున్నా అంటే, ఇందాకే ఓ కొటేషన్ చదివాను…చదివాక… కొండంత ఉత్సాహం వచ్చింది. అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది..సినిక్స్ వ్యాఖ్యలు విని – “ఔను.. ఇప్పుడు నేనేదో ఓ చిన్న పని చేస్తే మాత్రం తేడా ఏముంటుంది ఈ ప్రపంచానికి?” అని. ఈ కొటేషన్ నాకు జవాబిచ్చింది.


Act as if what you do makes a difference. It does.  -William James,psychologist (1842-1910)

రెండో భార్య కి ఆస్తిహక్కు గురించిన వార్త

8:05 సా. వద్ద జనవరి 28, 2008 | Incidents లో రాసారు | 5 వ్యాఖ్యలు

   ఈరోజు హిందూ పత్రిక లో రెండో భార్య కి భర్త ఆస్తి మీద హక్కు ఉండదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కనిపించింది. అది చదివాక కలిగిన ఆలోచనలే ఇప్పుడీ టపా రూపం లో బయటపెడుతున్నా 🙂 అసలు టపా ఇక్కడ చదవొచ్చు.

ఇంతకీ సారాంశం ఏమిటీ అంటే – ఆస్తిపై రెండో భార్య అయిన వ్యక్తికి ఎటువంటి హక్కూ ఉండదనీ, కానీ, ఆమె సంతానానికి మాత్రం కలుగుతుంది అని. మళ్ళీ అలా అని రెండో పెళ్ళి చెల్లుతుంది అని కాదు.

” Children born of second marriage are entitled to a share in the property of their father though the second marriage itself is void, the Supreme Court has held.”

పిల్లలు లీగలంట…. పిల్లల తల్లి మాత్రం లీగల్ కాదంట. అంటే… ఆ తల్లి పరంగా చూస్తే ఆమె దిక్కులేనిదే…ఒక వేళ పిల్లలు వదిలేస్తే. పైగా ఆ వార్త తాలూకా కేసు ప్రకారం మొదటి భార్య తానే భర్త కి దూరంగా వెళ్ళిపోయింది. తరువాతే భర్త రెండో పెళ్ళి చేసుకుని నలుగురు పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు అతను చనిపోగానే మొదటి భార్య కూడా ఆస్తి కోసం వస్తే ఇన్నేళ్ళూ కలిసి జీవించిన రెండో భార్యకి ఆస్తిహక్కు లేదంట… ఎప్పుడో వదిలి వెళ్ళిపోయిన మొదటి భార్య కి మాత్రం ఉందట! అంటే… రెండో భార్య కి ఆస్తి హక్కు కల్పించడం  అన్నది ఈ కేసు ఒక్కదాన్ని చూసి నిర్ణయించే విషయం కాకపోయినా కూడా, ఈ తరహా ప్రత్యేక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్నది నాకు తోస్తుంది. అయినా, పిల్లలకి హక్కున్నప్పుడు వాళ్ళ తల్లికి ఎందుకూడదు? అన్నది ఇక్కడ ప్రశ్న.  ఇంకో ప్రశ్న ఏమిటి అంటే… మొదటి భార్య ఈ కేసులోలా తానుగా బయటకు వెళ్ళిపోయినా కూడా ఆమెకి ఆస్తి హక్కు వస్తుందా? రెండో భార్య కి మాత్రం ఎందుకు రాదు? అన్నది.

నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది ఆ తీర్పు గురించి చదివాక. సుప్రీం కోర్టు అంతటి ధర్మాసనం అలా ఎలా తీర్పిచ్చింది? , అందులోనూ ఈ కేసు విషయంలో అని.  భర్తే మొదటి భార్య ని వదిలేసి రెండో మనిషి ని పెళ్ళి చేసుకుంటే అప్పుడు రెండో భార్య లీగల్ కాదు అనడం ఒక వాదన (అదన్నా కూడా మళ్ళీ పిల్లలకిచ్చి తల్లికివ్వకపోవడం అన్యాయమే అని తోస్తుంది.) మరి ఈ పేపర్ వార్త ప్రకారం కనీసం అది కూడా కాదు కేసు.  ఏమిటో ఈ తీర్పులు! సరిగా రాసిన వ్యాసం ఇంకోటి కావాలేమో..సరైన ఐడియా రావడానికి. అయినప్పటికీ, సుప్రీం కోర్టు తీర్పు నాకు నచ్చలేదు 😦

మా స్కూల్ లో ఓ చిచ్చర పిడుగు

1:27 సా. వద్ద సెప్టెంబర్ 26, 2007 | People లో రాసారు | 4 వ్యాఖ్యలు

ఈ చిచ్చర పిడుగు అన్న పదం ఇక్కడ వాడొచ్చో లేదో నాకు తెలీదు కానీ….. ఇక్కడ మొన్న సోమవారం నాడు వచ్చిన ఓ పిల్లని గురించి చెప్పడానికి ఇంతకంటే నాకు మంచి పదం కనబళ్ళేదు…

ఆ పిల్ల ఎల్కేజీ చదువుతోందట. వయసు ఏడేళ్ళట…ఏడేళ్ళకి ఎల్కేజీ ఏమిటి అనకండి…. అదంతే. పిల్ల బాగా తెలివితేటలు గలది…చురుగ్గా ఉంది. మూడు భాషల్లోనూ అక్షరాలు రాయడం వచ్చు. ఏడేళ్ళప్పటికి నాకైతే హిందీ రాదు మరి. మూడో తరగతి నుండి ఉండేది మాకు హిందీ…ఆ పిల్లకి అప్పుడే ఎలా వచ్చేసిందో ఏమో గానీ. ఎక్కాలొచ్చట…కొంతవరకూ. తెలుగైతే గుణింతాలు కూడా వచ్చు. ఏదడిగినా చురుగ్గా చేసేస్తోంది…వేగంగా కూడానూ. సరే, ఆ పిల్లని ఎంగేజ్ చేయాలని, మా స్కూల్ కి సంబంధించిన ఆషా మేడం కి తెలుగు అక్షరాలు నేర్పమని అన్నాం నేను, ఆషా గారూనూ. (ఆమె కి తెలుగు తెలియదు). ఆ పిల్లల సైకాలజీ ప్రకారం చూస్తే వాళ్ళు సిగ్గుపడి చెప్పననాలి. కానీ, ఈ పిల్ల దొరికిందే చాన్స్ అని చెప్తా అన్నది.

కాసేపు నేను వేరే పిల్లల గొడవ లో పడి వీళ్ళని చూడలేదు. తరువాత చూస్తే – “ఇది తప్పు రాసావు. ఇలా రాయకూడదు…ఇలా రాయాలి…” అనుకుంటూ ఏదేదో చెబుతూ ఉంది ఈ పిల్ల ఆషా గారికి :)) నిజం చెప్పొద్దూ…భలే నవ్వు వచ్చింది. పైగా, ఆవిడ అక్షరాలు రాస్తే, కరెక్షన్ కూడానూ! ఓ పక్క నవ్వొస్తోంది.. ఓ పక్క ఆ పిల్లని చూస్తూ ఉంటే ముచ్చటేస్తోంది. ఆ స్కూలుకొచ్చిన పిల్లల్లో నేను – కాస్త చురుగ్గా, ఆత్మవిశ్వాసం తో నిండి ఉండి, మరీ అల్లరిగా కాక బుద్ధిగా ఉండే పిల్లల్ని ఇద్దరినే చూసాను. ఒకరు మీనా, ఇది వరలో రెండు మూడు సార్లు ఈ బ్లాగులోనే రాసాను తన గురించి. రెండో పిల్ల ఈ అమ్మాయి శిరీష. అందులో మీనా అందరికంటే పెద్ద పిల్ల, ఈమె దాదాపు అందరికంటే చిన్న పిల్లానూ.

ఏమైనా కూడా ఈ పిల్ల ఇలాగే ఉంటే మంచి స్థానానికి వస్తుంది జీవితం లో అని అనిపిస్తోంది.

ఇది నాస్తికత్వమెలా ఔతుంది?

10:55 ఉద. వద్ద సెప్టెంబర్ 21, 2007 | What do you say? లో రాసారు | 20 వ్యాఖ్యలు

ఈ ప్రపంచికం లో మతాలకేం కొదువ? హిందూ మతం…క్రిష్టియన్ మతం, ఇస్లాం, బుద్ధిజం, సిక్కిజం, జైనిజం, Zorastrianism, బహాయ్ మతం, కంఫ్యూజియనిజం, Judaism, Shintoism…వగైరా వగైరా బోలెడు మతాలున్నాయి….  నా వరకు నేను అర్థం చేసుకున్న మతం – అదొక జీవన విధానం అన్న అర్థం లో. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళవి అన్నట్లు ఉన్నా ఇన్ని రోజులూ. ఈరోజు ఈ బ్లాగు రాస్తా అనుకోలేదు కానీ… ఇక ఉండబట్టలేక బహిరంగంగా గోడు వెళ్ళబోసుకుంటున్నా 🙂

ఏం చెప్పమంటారు? ఏమిటో… నాకీ మధ్య “మానవ సేవే మాధవ సేవ” అన్న మాటలు మునుపెన్నడూ లేనంత నిజం అనిపిస్తున్నాయి. “దేవుడెక్కడో లేడు… నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు… మనందరిలో ఉన్నాడు” అన్న భావన ఎక్కువైంది… ఈ ప్రభావం లో ఈ పూజలూ, పునస్కారాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది.  మామూలుగానే ఎప్పుడో మా నాన్న ఉన్నప్పుడు తప్ప నేనెప్పుడూ పెద్దగా రిలీజియస్ కాదు…నాకు గుర్తున్నంత వరకూ. చిన్నప్పుడు అయితే, ఆయన నేర్పేవాళ్ళు కనుక ఏదో ఆ శ్లోకాలు అవీ చదవడం వంటివి చేసేదాన్ని. కానీ, ఇటీవలి కాలం లో గుళ్ళకు వెళ్ళడం కూడా ఏదో ఓ ఔటింగ్ లాగా, కాస్త రిలాక్సేషన్ కోసం ఆ వెళదాం అన్న వాళ్ళతో వెళ్తున్నా కానీ… మరింకే కారణానికీ కాదు…. ఈ విషయం పైనే రెండు రోజులుగా నా స్నేహితురాలితో చర్చలు. నువ్వు నాస్తికురాలివి అంటుంది ఆమె. నేనెట్ల నాస్తికురాలినౌతాను? (అసలెవరైనా నాస్తికులు కాలేరని నా నమ్మకం. ఏదో ఓ దాన్ని వాళ్ళు విశ్వసిస్తారు కదా…ఆ సిద్ధాంతమే దైవం మరి!) అని నేనంటాను.  మా చర్చ ఇలా ఉంది… యధాతథంగా కాదు కానీ… ఈ విధంగా-

“నేను నాస్తికురాలిని అని ఎవరన్నారు?”

“మరి నువ్వు దేవుణ్ణి నమ్మవు కద?”

“అసలు నేను నమ్మను అని ఎవరన్నారు?”

“మరి పూజలు అవీ ఇష్టం లేదు అన్నావు కదా?”

“అయితే? దేవుణ్ణి నమ్మనా?”

“మొన్నోరోజు విగ్రహారాధన కూడా నచ్చట్లేదు అన్నావు కదా?”

“అవును, అయితే? నాస్తికురాలినా?”

“దేవుణ్ణి నమ్మకపోతే నాస్తికులనే అంటారు!”

“మొదటగా ఒక విషయం – నాకు పూజల మీద ఆసక్తి లేదు అని మాత్రమే అన్నాను. విగ్రహారాధన కూడా అంతే. నాస్తికత్వానికి, వాటికీ తేడా ఉంది.”

“సరే. ఇప్పుడేమిటంటావ్?”

” అంటే నువ్వు నమ్మే దేవుడికి నేను పూజ చేయకపోతే నేను నాస్తికురాలినా? ఈ లెక్కన నీకు క్రిశ్టియన్లు, ముస్లింలు వీళ్ళందరూ నాస్తికుల్లానే కనబడాలే?”

“అలా ఎలా అంటాను? వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ కున్నారు…”

“మరి నా దేవుళ్ళు నాకూ ఉన్నారు.”

“ఎవరు?”

“మీరే…”

“??”

“మానవత్వం ఏ కాస్త ఉన్న మనిషైనా దేవుడే. ఇంకో ప్రాణికి ఉపయోగపడే ఏ ప్రాణైనా దేవుడే. మనుష్యులకు ఉపయోగపడే వస్తువులు కూడా దేవుళ్ళే మరి (దేవుడు చేసిన దేవుళ్ళు అనాలేమో వీటిని…హీహీ)”

“అది వేరు…”

“అదే మరి. నాకు అది వేరు కాదు.”

“ఇంత మంది నమ్ముతున్నారు కదా….”

“నేను వాళ్ళనేమన్నా అన్నానా? నేను ఈ దేవుళ్ళను నమ్ముతా అంటున్నా. ఎవరి మతం వారిది..ఎవరి జీవితం వారిదీ”

– ఇక్కడ ఆగింది ఈరోజుకి.

నా మీద “సత్యమే శివం” ప్రభావం బాగా ఉంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు అనిపించింది ఈ చర్చ ను బట్టి. ఏమైనా, నేను ఒక దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం ప్రకారమే జీవిస్తున్నాను. ఆ నమ్మకం తోనే జీవిస్తాను, ఏదో జరిగి నన్ను బలంగా కదిలించి నా మతం తప్పు అని నిరూపిస్తే చెప్పలేం కానీ. నా మతం వల్ల నా తోటి వారికి జరిగేది మేలే. నా మతం ఆచారాలు(??) నేను పాటిస్తూనే ఉన్నాను. మరి అలాంటప్పుడు నేను నాస్తికురాలినెట్లవుతా? అది కూడా నాకెక్కడా ఏ మతం మీదా ద్వేషం లేనప్పుడు….నాకు దేవుడు ఉన్నాడు అన్న దృఢమైన  విశ్వాసం ఉన్నప్పుడు?

నాకు తెలిసిన సత్యమే నా శివం.  అప్పుడు నాస్తికత్వానికి తావేదీ?

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.
Entries మరియు వ్యాఖ్యలు feeds.