రెండు వార్తలు

ఆగష్టు 27, 2008 at 9:10 పూర్వాహ్నం | In General | 6 Comments

మొన్నాదివారం నాటి ఈనాడులో వచ్చిన వార్తల్లో రెండు వార్తలు చూసాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. మొదటి వార్త కాస్త నవ్వు తెప్పించింది. రెండవది కాస్త ఆలోచింపజేసింది. రెండు వార్తలూ పేజీలో చూడొచ్చు.

మొదటిది: “ద్విచక్ర వాహనం వెనుక సీటుపై చీరకట్టుతో ప్రయాణం వద్దు! ఒకవైపు కూర్చోవడం వల్లే ప్రమాదాలు: కేరళ హైకోర్టు”
ఇది కాస్త నవ్వు తెప్పించింది. అంటే, చీర కట్టుకుంటే ద్విచక్రవాహనాలు ఎక్కకూడదు అనమాట. అసలుకైతే, కేరళ హైకోర్టు అన్నది – ఒకవైపుకి కూర్చుని ప్రయాణం చేయకూడదని. దానికి అర్థం ఇదే కనుక ఈనాడు ఇదే హెడ్‍లైన్ చేసేసింది :) ) కనీసం దక్షిణ భారద్దేశం లో చీర అన్నది చాలా కామన్ గా కనిపిస్తుంది. యువతులను, పిల్లలను పక్కన పెడితే, తక్కినవారందరూ చాలావరకూ చీరే వేసుకుంటు ఉంటారు. కార్లవాళ్ళని వదిలేస్తే, చాలా వరకు మధ్యతరగతి జీవులకు ద్విచక్ర వాహనాలే ఉంటాయి. భార్యా-భర్తా స్కూటర్ మీద వెళ్ళడం, ఒక్కోసారి పిల్లలతో వెళ్ళడం – ఇదంతా చిన్నప్పట్నుంచీ చూస్తున్న విషయమే. ఇలా కూర్చోడం వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి? మొత్తం యాక్సిడెంట్లలో అది ఎంత శాతం? జరిగినవి కూడా ఒక వైపుకి కూర్చోడం అన్న ఏకైక కారణం వల్ల జరిగాయా? అన్న వివరాలు కూడా తెలిపి ఉంటే, చూసి తెలుసుకుని తరించి ఉండేవాళ్ళం. నిజానికి ఒకవైపుకి కూర్చుంటే దూకేయడం ఈజీకదా… ఆ లెక్కన, వాళ్ళు బతికిపోవాలి కదా! ;) లేదంటే, ఇదంతా విధి ఆడిస్తున్న వింత నాటకమేమో. ఆటోవారి బాగు కోసం కోర్టు తాపత్రేయమేమో. లేకుంటే, కారు డీలర్ల కోసమో! లేకుంటే, చీరని మరుగున తోయడానికేమో! ఆడవారిని బండి నడపడానికి ప్రోత్సహించడానికేమో. టూవీలర్ల సేల్స్ డబల్ చేయడానికేమో! లేదంటే, ఇవన్నీ కాకుండా ఆడవాళ్ళని రాతియుగంలోకి, వంటింట్లోకి మళ్ళీ తరిమేయడానికేమో!! లోగుట్టు కేరళ హైకోర్టుకే ఎరుక.

రెండవది: “కల్యాణ మండపం నిబంధనే అమ్మాయిని కాపాడింది!”
ఒక కల్యాణమండపంలో నిబంధన ఏమిటీ అంటే, అక్కడ పెళ్ళి చేసుకోబోయే వధూవరులు తప్పనిసరిగా హెచ్‍ఐవీ పరీక్షలు చేసుకోవాలని. దీని కారణంగా పీటల దాకా వచ్చిన ఓ పెళ్ళి నుండి ఓ అమ్మాయి బయటపడింది, వరుడికి హెచ్‍ఐవీ పాజిటివ్ అని తేలడంతో. ఈ వార్త చదివాక అన్ని కల్యాణ మండపాల్లోనూ ఇలాంటి నిబంధన ఉండాలా? అన్న ఆలోచన వచ్చింది. హెచ్‍ఐవీ ఉందన్న సంగతి ఆ వరుడికి తెలిసే పెళ్ళికి సిద్ధమయ్యాడో లేక తెలీక చేసాడో అన్నది అనుమానంగానే ఉంది కానీ, తెలిసి సిద్ధమైన కేసుల్లో ఇలాంటి స్కీము బాగా పనికొస్తుంది. కానీ, ఇంతదాకా వచ్చాక (ఈ పెళ్ళి ముహుర్తానికి కొన్ని గంటల ముందే ఫలితం తెలిసింది) పెళ్ళి చెడితే కలిగే ఎమోషనల్ స్ట్రెస్ కంటే ముందే ఈ టెస్టులేవో చేసుకోడానికి ముందుకు వచ్చి ఉండొచ్చు కదా అనిపించింది. కానైతే కల్యాణ మండపం వారి ఆలోచన మాత్రం మెచ్చుకోదగ్గదిగా అనిపించింది.

నికేతా మెహ్‌తా కేసు

ఆగష్టు 8, 2008 at 9:23 పూర్వాహ్నం | In Incidents | 2 Comments

నిన్న కాసేపు నికేతా మెహ్తా కేసు గురించి చదువుతూ ఉన్నాను. మొదట దీనిపై ఆసక్తి కలిగించింది The Statesman దినపత్రిక లో నిన్న వచ్చిన వ్యాసం. తరువాత Times of India ఆన్లైన్ వ్యాసాలు చదివాక ఈ ఉదంతం పై నా టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. ఈ కేసు గురించి వివరంగా రాయబడ్డ బ్లాగు టపా ఇక్కడ.

క్లుప్తంగా చెప్పాలంటే, నికేతా మెహ్‌తా తనకి పుట్టబోయే బిడ్డకి గుండె జబ్బు ఉండే ప్రమాదం ఉందనీ, పుట్టిన క్షణం మొదలుకుని జీవితాంతం పేస్‌మేకర్ వాడాల్సిన అవసరం వచ్చే అవకాశాలు లేకపోలేదని తెలిసి తనకి అబార్షన్ కి అనుమతినివ్వాలని కోర్టును కోరింది. మన దేశపు చట్టాల ప్రకారం ఇరవై వారాలలోపే అబార్షన్ చేసుకోవాలట. కానీ ఈవిడకి ఇరవై నాలుగు వారాలకి ఈ విషయం తెలిసింది కనుక కోర్టుని చేరింది విషయం. హైకోర్టేమో ఆమె తరపు వాదన తోసిపుచ్చింది. ఈ అబార్షన్ చట్టసమ్మతం కాదు అని తేల్చింది.

ఈ కేసు ఫలితం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నిజానికి. ఓ పక్క ఆ పుట్టబోయే బిడ్డ కి జీవితాంతం బాధలు పడే అవకాశాలు ఉన్నాయి అని తెలిసినప్పుడు అబార్షన్ కి, అదీ తల్లిదండ్రులు కోరుతున్నప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అని. అబార్షన్ నేరమా? ఘోరమా? తప్పా? ఒప్పా? అన్న మీమాంస కాదు ఈ టపా. ఈ కేసు విషయం లో ఏది న్యాయం అన్న చర్చ కోసం. మామూలుగా అబార్షన్ నేరం అనుకున్నాకూడా, ఇలాంటి కేసుల్లో ఇప్పుడు నేరం చేస్తే ఓ జీవితాన్ని జీవితాంతం చస్తూ జీవించే యాతన నుండి తప్పించవచ్చు కదా? ఈ కేసులో ఒక వాదన ఏమి రావొచ్చు అంటే – “ఒకవేళ ఇవేమీ లేకుండా బిడ్డ మామూలుగానే పుడితే…అప్పుడీ అబార్షన్ ఆ బిడ్డని చంపేసినట్లే కదా?” అని. కానీ, అది ఖచ్చితంగా చెప్పలేనప్పుడు, శిశువు గుండెజబ్బుతో పుట్టే అవకాశం ఉన్నప్పుడు – ఆ లాజిక్ పని చేస్తుందా? జబ్బుతో పుట్టిన బిడ్డ తో తల్లిదండ్రుల జీవితం, పుట్టిన శిశువు జీవితం, వీళ్ళలో జరిగే మానసిక సంఘర్షణా – ఇవన్నీ ఆలోచిస్తే మరి?

తొమ్మిదేళ్ళ వయసు నుండి పేస్‌మేకర్ వాడుతున్న ఓ ముప్ఫై ఐదేళ్ళ మనిషి కథనం ప్రకారం జీవితాంతం దానిపై ఆధారపడి బ్రతకాల్సిన మనుషులు కూడా మామూలు జీవితం గడపొచ్చట.ఇప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా ట్రీట్ చేయొచ్చని అతను అన్నాడు. ఈ విషయం బానే ఉంది వినడానికి. అయితే, తెలిసి తెలిసీ…. అన్న భావన ఆ తల్లిదండ్రుల్లో రావడంలో నాకేమీ అసహజత్వం కనబడ్డం లేదు. పైగా, పేస్‌మేకర్ ట్రీట్‌మెంట్ ఖర్చుతో కూడుకున్నదట. జీవితాంతం ఆ ఖర్చు భరించే స్థోమత తల్లిదండ్రులకి ఉండాలి కదా.

“”But I will have to now stop working. We are not that rich to afford full-time nannies. Finances will certainly be one concern.”

-అన్న మాటల్ని బట్టి చూస్తే నికేతా దంపతుల అసహాయత అర్థమౌతోంది కదా. దానికి జవాబు గా బోలెడు సంస్థలు ముందుకొస్తున్నాయి, ప్రభుత్వం సాయం చేస్తుంది జీవితాంతం – వంటి వాదనలు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఇప్పుడిస్తున్న వాగ్దానాలే-వేటికీ గ్యారంటి లేదు అన్నది ఒక విషయమైతే, ఇలా ఎన్ని కేసులకని సాయం చేస్తారు? అన్నది మరో విషయం. ఈ కేసు తరువాత తమకి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలన్న కేసులు ఎక్కువైపోయాయంట కాబోయే తల్లిదండ్రుల్లో. ఈ విషయానికి సంబంధించి ఉపయోగపడే రకరకాల టెస్టుల గురించిన సమాచారం ఇక్కడ.

మన అబార్షన్ చట్టాల ప్రకారం 26 వారాల తర్వాత తల్లి కి ప్రమాదమైనప్పుడు అబార్షన్ చేసుకునే సౌలభ్యం ఉందట కానీ, బిడ్డ పరిస్థితి బాలేకపోతే కాదట. ఇది మరో వింత నాకు. ఏం? పుట్టాక ఆ బిడ్డ మాత్రం మనిషి కాదా? అలా అబార్షన్ ఆపాక పుట్టిన శిశువు ఏదో కారణానికి మరణిస్తే మాత్రం ఆ తల్లికి క్షోభ కలగదా?

పుట్టబోయే బిడ్డ పుట్టాలా వద్దా అన్న విషయం లో తల్లి అభిప్రాయానికి విలువ లేదా? ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మానసిక పరిస్థితి ఏమిటి? వంటివి మరిన్ని ప్రశ్నలు. అసలు బాధ్యత గల ఏ తల్లీ కారణం లేకుండా తనకి పుట్టబోయే బిడ్డను చంపాలనుకోదు అన్నది మరొక పాయింటు.  అబార్షన్ గురించి తల్లికి కొంత స్వేఛ్ఛ ఉండాలని నా అభిప్రాయం. పెంచడానికో, పుట్టించడానికో తల్లికి ఒకవేళ వ్యతిరేకత ఉంటే, ఆమెని ఆమె తాలూకా మనుషులు ఒప్పించలేకపోతే…బలవంతంగా కోర్టు బిడ్డని పుట్టనిచ్చాక ఆ బిడ్డ పరిస్థితి సాఫీగా ఉండాలనేముంది? నికేతా కేసు గురించి కాదు ఇది అంటున్నది. ఆ కేసులో కారణాలు వేరు. ఆ కేసులో నేనైతే నికేతాకే ఓటు వేస్తున్నాను. ఇప్పుడు చెప్పింది more general context.

“”But what is disappointing is that we have been proved to be fools. We are educated fools. People in remote areas go to quacks for an abortion. The lesson here being sent out is: don’t follow the law. We are being punished for being law-abiding citizens.” -అన్న మాటల్లో అర్థమౌతున్నాయి నికేతా మెహ్‌తా ఈ కేసు విషయం లో అనుభవించిన క్షోభా, ఫలితం ఆమెలో కలిగించిన అసంతృప్తీ. “We have initiated awareness about the abortion law and that it needs to change with time and changing societal standards and medical advances,’’  – అన్నప్పుడు కాస్త ఆశాభావం కూడా కనిపించింది. (మూలం)

సందీప్ పాండే గురించి

ఆగష్టు 5, 2008 at 10:45 పూర్వాహ్నం | In People | 1 Comment

సందీప్ పాండే ఎవరు? అన్న ప్రశ్న నుండి మొదలుపెడితే, ఆయన Asha Foundation వ్యవస్థాపకుల్లో ఒకరు. 2002లో రామన్ మెగసేసే అవార్డు గ్రహీత. భారద్దేశానికి చెందిన వారిలో అందరికంటే చిన్న వయసులో ఈ అవార్డు పొందిన వ్యక్తి. Active social activist. ఆయన కార్యరంగం ప్రధానంగా ఉత్తరప్రదేశ్. వ్యక్తిగత విషయాలకొస్తే, UC-Berkeley లో Mechanical Engineering లో PhD చేసారు. తరువాత రెండేళ్ళు IIT-Kanpur లో పని చేసి, 1993 లో పూర్తి స్థాయి సమాజ సేవకుడిగా మారిపోయారు.

నిన్న రాత్రి IIIT లో ఆయన ప్రసంగం ఉండింది. మాకొచ్చిన మెయిల్ సారాంశం ఇదీ:

Dr Sandeep Pandey will talk about his experiences as a social
activist in the rural areas of Uttar pradesh. He will touch upon
the themes of Right to Information, Right to Food, Right to Work,
Right to Education, Harmony in community, Nuclear disarmamemt,
Peace and Anti-Globalisation.

ఆయన గురించి చెప్పడానికి చాలానే ఉంది నిజానికి. అంతా ఈ చిన్న టపాలో కూర్చాలనుకోవడం మరీ అతి చేయడమే. అందుకని, నేను చెప్పదలుచుకున్నవి మాత్రం చెబుతాను. :) ఇంతకీ, కాలేజీ లో ప్రసంగం లో RTI అని మొదలైనా కూడా, అణు ఒప్పందం, SEZs, Social inequality, poverty వంటి విషయాలు మొదలుకుని Globalisation, Over-population దాకా ఎన్నో విషయాల మీద సాగింది. విన్నవారి ప్రశ్నలని బట్టి ప్రసంగం రూటు మారుతూ వచ్చింది. వింటున్నంత సేపూ నన్ను ఆకట్టుకున్నది ఆయన లో ఉన్న simplicity. చెప్పదలుచుకున్నది స్పష్టంగా, సూటిగా చెప్పడం, చెప్పిన దానిపై ఎక్కడా నమ్మకం సడలకపోవడం. ఆయన చెప్పినవన్నీ నాకు నచ్చాయని కాదు. కొన్ని చోట్ల మరీ idealist లాగా అనిపించాడు. కొన్ని చోట్ల పూర్తి ఆధునికతకి వ్యతిరేకిలా అనిపించాడు. అయినప్పటికీ కూడా, సామాజిక విషయాలపై ఓ సమాజ సేవకుడి మాటలు, అదీ ఈ స్థాయి వ్యక్తి మాటలు లైవ్ వినడం నాకు ఇదే మొదటి సారి. తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉండింది. అణుఒప్పందం గురించి ఇప్పటిదాకా చదవని point of view ని ఆయన Buddha weeps in Jadugoda అన్న కథలో చెప్పారు. ప్రస్తుత అణుఒప్పందం పై ఈ కోణంలో ఇప్పటిదాకా పేపర్లలో అయితే చదవలేదు నేను. వేరే context లో ఈ విషయాల గురించి చదివినా కూడా. పాండే గారి వివరణలు ఈ విషయంలో వారి పరిశోధనని గురించి చెప్పాయి. RTI ఎలా మొదలైంది అన్న కథ కూడా నచ్చింది నాకు.

పొద్దున్న ఆయనదే ఒక వీడియో చూసాను. ఇది ఒక అరగంట సాగే ఆయన ఇంటర్వ్యూ. వివిధ విషయాల మీద ఆయన అభిప్రాయాలు. ఇక్కడ కూడా నాకు నచ్చింది ఇదే. ఆయన లో ఉన్న స్పష్టత, simplicity. చెప్పిన విషయాలన్నీ మనం ఒప్పుకుంటామా లేదా అన్నది వేరే విషయం. ఒక మనిషికి తాను చేస్తున్న పని సరైనదని పూర్తి నమ్మకముంటే, అది ఎలా ఉంటుందో పాండే మాటల్లో తెలుస్తోంది నాకు :) ఒక విధంగా నిన్నటి ప్రసంగం నాకు నిరాశే కలిగించి ఉండాలి. కానీ, Sandeep Pandey – the man గురించి కాస్త ఎక్కువ తెలుసుకునే అవకాశం కల్పించింది కనుక, క్షమించేస్తున్నా ;)

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.