Rosy గారితో కాసేపు
మార్చి 20, 2008 at 11:16 పూర్వాహ్నం | In People | 6 Commentsనాకూ, ప్రశాంతికి మధ్య జరిగిన ఓ ఆన్లైన్ సంభాషణ లో రోసీ గారి గురించి తెలిసింది. చందానగర్ లో ఒక స్లం ఏరియా లో ఓ స్కూలు పెట్టి (ఫుల్ టైం స్కూల్) నడుపుతున్నారు అని. నాకు కాలేజీ నుండి దగ్గరే కదా, అని ఆవిడ కాంటాక్ట్ డీటైల్స్ సంపాదించి ఈరోజు కలిసాను. కలిసి వచ్చాక ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నా. ఆవిడ ప్రచారం ఇష్టం లేదన్నది కానీ, నా ఉద్దేశ్యం లో మంచి పని చేసేవాళ్ళ గురించి ఇతరులకి చెప్పడం లో తప్పు లేదు. పైపెచ్చు, స్పూర్తి కూడా కలిగిస్తారు వాళ్ళు.
ఇంతకీ, నేను చందానగర్ స్టేషన్ దగ్గర కలుస్తా అని చెప్పాను. దానికి వచ్చే దారిలోనే అర్థమైంది అక్కడి మనుష్యుల living standards. స్టేషన్ దగ్గర పాపిరెడ్డి కాలనీ అని ఉంది. అక్కడ కాస్త నయం… పక్కా ఇళ్ళూ అవీ కనిపించాయి. ఇంతకీ ఆమెని కలిసాను. తర్వాత, వాళ్ళ స్కూలుకి తీసుకెళ్ళారు. ఆ కాలనీ లోనే కాస్త ముందుకెళితే, SVN school అని కనిపించింది. శారదా విద్యా నికేతన్ అట పూర్తి పేరు. స్కూల్లో నలభై మంది పిల్లలు. అందరూ ఇదివరలో కాగితాలేరడమో, అడుక్కోవడమో చేసిన పిల్లలే. ఒకరిద్దరి నుండి వారి కథలు కూడా విన్నాను. ఈ స్కూల్లో ఓ మానసిక వికలాంగుడైన అబ్బాయి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ మొదట స్కూల్లో చేరక ముందు ఎలా ఉండేవారు? ఇప్పుడెలా ఉన్నారు? అన్నది రోజీ గారు చెబుతూ ఉంటే ఆశ్చర్యమేసింది.
ఇది కాక ఓ అనాథ శరణాలయం కూడా నడుపుతున్నారు ఈమె. దానికి నేను వెళ్ళలేదు..కనుక దాని వివరాలు పెద్దగా తెలీవు.
ఇది మా ఆషాకిరణ్ మాదిరి కాదు. ఫుల్-టైం బడి. కనుక, పిల్లల మీద మరింత శ్రద్ధ పెట్టవచ్చు. ప్రస్తుతమున్నది అద్దె భవనం. త్వరలో సొంత భవనం కట్టుకోగలం అన్నది ఆమె ఆశ. ఇంతకీ, వింత ఏమిటీ అంటే, అక్కడ చెప్పుకోదగ్గ ఫండింగ్ అంటూ రెగులర్ గా ఏదీ లేదు. ఆమె, కుటుంబ సభ్యులే దీనికి మహారాజ పోషకులు. అంటే, వాళ్ళేదో మహా వీర ధనవంతులని కాదు. వాళ్ళకి ఉన్న దానిలోనే ఇదంతా చేస్తున్నారు. ఇటీవలే applabs వాళ్ళు వచ్చి నోట్ బుక్స్ అవీ ఇచ్చారట స్కూలుకి. ఆవిడ ద్వారా ఆ కాలనీ వాసుల జీవితాలూ…వారి కష్ట నష్టాల్లోకి తొంగిచూడగలిగాను. నాకు బయటి ప్రపంచం తో అందునా, ఆ తరహా ప్రపంచం తో సంబంధాలు తక్కువే. కనుక, నాకు వాళ్ళ గురించి చెప్పడం ద్వారా సమాజం లో నేనూ ఉన్నా కనుక సమాజానికి నేనూ ఏదో చేయాలి అని మళ్ళీ గుర్తు చేసిన రోజీ గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోను?
ఇది ఇంట్రో టపా. మరో కొద్ది రోజుల్లో మరో టపా వివరంగా రాస్తాను ఈ ట్రిప్ గురించి.
Motivation for the day :)
మార్చి 18, 2008 at 6:56 పూర్వాహ్నం | In General | 3 Commentsఏదో ఓ చిన్న మంచి పని(అదే…మనం మంచి అనుకున్నది..) చేస్తాము. అది ఎవరికో ఎక్కడో ఓ చోట మేలు కలిగిస్తుంది. మనం ఆనందిస్తాం. వాళ్ళూ ఆనందిస్తారు. అది ఈ వ్యవహారాన్ని చూసే ఒక కోణం.
మరో కోణం, కాస్త సినికల్ కోణం – “నువ్వొక్కదానివి ఏదో చిన్న పనిచేస్తే? ఏమౌతుంది? ఏమన్నా తేడా ఉంటుందా వాళ్ళ జీవితాల్లో?”.
ఇంకో కోణం – “ఇలా చిన్న చిన్న పనులు చేయడం కాదు. ఏదో చేయాలి…. అది నిజమైన పెద్ద మార్పు తీసుకురావాలి.” (దీన్నే enterpreneurship కోణం అంటాను నేను.)
ఇక, రెండో కోణం ని చూస్తే, ప్రతి ఒక్కరూ అంత నిరాశగా ఉండరు. మూడో కోణం చూస్తే, ప్రతి ఒక్కరూ అంత పనిమంతులై కూడా ఉండరు. ఎవరికి చేతనైన విధంగా వారు చేద్దామని అనుకుంటారు. (అసలు నాకెందుకు? నేను బాగున్నా కదా! అనేసుకుంటే అసలీ టపా మీక్కాదు…:) సమస్యే లేదు అలా అనుకుంటే మీకు…)
మొదటి రకం వాళ్ళని ప్రోత్సహిస్తే మూడోరకం లోకి మారినా మారొచ్చు. చెప్పలేం. అసలీ సుత్తంతా ఎందుకు చెబుతున్నా అంటే, ఇందాకే ఓ కొటేషన్ చదివాను…చదివాక… కొండంత ఉత్సాహం వచ్చింది. అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది..సినిక్స్ వ్యాఖ్యలు విని – “ఔను.. ఇప్పుడు నేనేదో ఓ చిన్న పని చేస్తే మాత్రం తేడా ఏముంటుంది ఈ ప్రపంచానికి?” అని. ఈ కొటేషన్ నాకు జవాబిచ్చింది.
Act as if what you do makes a difference. It does. -William James,psychologist (1842-1910)
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.