మా స్కూల్ లో ఓ చిచ్చర పిడుగు
సెప్టెంబరు 26, 2007 at 1:27 అపరాహ్నం | In People | 4 Commentsఈ చిచ్చర పిడుగు అన్న పదం ఇక్కడ వాడొచ్చో లేదో నాకు తెలీదు కానీ….. ఇక్కడ మొన్న సోమవారం నాడు వచ్చిన ఓ పిల్లని గురించి చెప్పడానికి ఇంతకంటే నాకు మంచి పదం కనబళ్ళేదు…
ఆ పిల్ల ఎల్కేజీ చదువుతోందట. వయసు ఏడేళ్ళట…ఏడేళ్ళకి ఎల్కేజీ ఏమిటి అనకండి…. అదంతే. పిల్ల బాగా తెలివితేటలు గలది…చురుగ్గా ఉంది. మూడు భాషల్లోనూ అక్షరాలు రాయడం వచ్చు. ఏడేళ్ళప్పటికి నాకైతే హిందీ రాదు మరి. మూడో తరగతి నుండి ఉండేది మాకు హిందీ…ఆ పిల్లకి అప్పుడే ఎలా వచ్చేసిందో ఏమో గానీ. ఎక్కాలొచ్చట…కొంతవరకూ. తెలుగైతే గుణింతాలు కూడా వచ్చు. ఏదడిగినా చురుగ్గా చేసేస్తోంది…వేగంగా కూడానూ. సరే, ఆ పిల్లని ఎంగేజ్ చేయాలని, మా స్కూల్ కి సంబంధించిన ఆషా మేడం కి తెలుగు అక్షరాలు నేర్పమని అన్నాం నేను, ఆషా గారూనూ. (ఆమె కి తెలుగు తెలియదు). ఆ పిల్లల సైకాలజీ ప్రకారం చూస్తే వాళ్ళు సిగ్గుపడి చెప్పననాలి. కానీ, ఈ పిల్ల దొరికిందే చాన్స్ అని చెప్తా అన్నది.
కాసేపు నేను వేరే పిల్లల గొడవ లో పడి వీళ్ళని చూడలేదు. తరువాత చూస్తే – “ఇది తప్పు రాసావు. ఇలా రాయకూడదు…ఇలా రాయాలి…” అనుకుంటూ ఏదేదో చెబుతూ ఉంది ఈ పిల్ల ఆషా గారికి
) నిజం చెప్పొద్దూ…భలే నవ్వు వచ్చింది. పైగా, ఆవిడ అక్షరాలు రాస్తే, కరెక్షన్ కూడానూ! ఓ పక్క నవ్వొస్తోంది.. ఓ పక్క ఆ పిల్లని చూస్తూ ఉంటే ముచ్చటేస్తోంది. ఆ స్కూలుకొచ్చిన పిల్లల్లో నేను – కాస్త చురుగ్గా, ఆత్మవిశ్వాసం తో నిండి ఉండి, మరీ అల్లరిగా కాక బుద్ధిగా ఉండే పిల్లల్ని ఇద్దరినే చూసాను. ఒకరు మీనా, ఇది వరలో రెండు మూడు సార్లు ఈ బ్లాగులోనే రాసాను తన గురించి. రెండో పిల్ల ఈ అమ్మాయి శిరీష. అందులో మీనా అందరికంటే పెద్ద పిల్ల, ఈమె దాదాపు అందరికంటే చిన్న పిల్లానూ.
ఏమైనా కూడా ఈ పిల్ల ఇలాగే ఉంటే మంచి స్థానానికి వస్తుంది జీవితం లో అని అనిపిస్తోంది.
ఇది నాస్తికత్వమెలా ఔతుంది?
సెప్టెంబరు 21, 2007 at 10:55 పూర్వాహ్నం | In What do you say? | 20 Commentsఈ ప్రపంచికం లో మతాలకేం కొదువ? హిందూ మతం…క్రిష్టియన్ మతం, ఇస్లాం, బుద్ధిజం, సిక్కిజం, జైనిజం, Zorastrianism, బహాయ్ మతం, కంఫ్యూజియనిజం, Judaism, Shintoism…వగైరా వగైరా బోలెడు మతాలున్నాయి…. నా వరకు నేను అర్థం చేసుకున్న మతం – అదొక జీవన విధానం అన్న అర్థం లో. ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళవి అన్నట్లు ఉన్నా ఇన్ని రోజులూ. ఈరోజు ఈ బ్లాగు రాస్తా అనుకోలేదు కానీ… ఇక ఉండబట్టలేక బహిరంగంగా గోడు వెళ్ళబోసుకుంటున్నా
ఏం చెప్పమంటారు? ఏమిటో… నాకీ మధ్య “మానవ సేవే మాధవ సేవ” అన్న మాటలు మునుపెన్నడూ లేనంత నిజం అనిపిస్తున్నాయి. “దేవుడెక్కడో లేడు… నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు… మనందరిలో ఉన్నాడు” అన్న భావన ఎక్కువైంది… ఈ ప్రభావం లో ఈ పూజలూ, పునస్కారాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది. మామూలుగానే ఎప్పుడో మా నాన్న ఉన్నప్పుడు తప్ప నేనెప్పుడూ పెద్దగా రిలీజియస్ కాదు…నాకు గుర్తున్నంత వరకూ. చిన్నప్పుడు అయితే, ఆయన నేర్పేవాళ్ళు కనుక ఏదో ఆ శ్లోకాలు అవీ చదవడం వంటివి చేసేదాన్ని. కానీ, ఇటీవలి కాలం లో గుళ్ళకు వెళ్ళడం కూడా ఏదో ఓ ఔటింగ్ లాగా, కాస్త రిలాక్సేషన్ కోసం ఆ వెళదాం అన్న వాళ్ళతో వెళ్తున్నా కానీ… మరింకే కారణానికీ కాదు…. ఈ విషయం పైనే రెండు రోజులుగా నా స్నేహితురాలితో చర్చలు. నువ్వు నాస్తికురాలివి అంటుంది ఆమె. నేనెట్ల నాస్తికురాలినౌతాను? (అసలెవరైనా నాస్తికులు కాలేరని నా నమ్మకం. ఏదో ఓ దాన్ని వాళ్ళు విశ్వసిస్తారు కదా…ఆ సిద్ధాంతమే దైవం మరి!) అని నేనంటాను. మా చర్చ ఇలా ఉంది… యధాతథంగా కాదు కానీ… ఈ విధంగా-
“నేను నాస్తికురాలిని అని ఎవరన్నారు?”
“మరి నువ్వు దేవుణ్ణి నమ్మవు కద?”
“అసలు నేను నమ్మను అని ఎవరన్నారు?”
“మరి పూజలు అవీ ఇష్టం లేదు అన్నావు కదా?”
“అయితే? దేవుణ్ణి నమ్మనా?”
“మొన్నోరోజు విగ్రహారాధన కూడా నచ్చట్లేదు అన్నావు కదా?”
“అవును, అయితే? నాస్తికురాలినా?”
“దేవుణ్ణి నమ్మకపోతే నాస్తికులనే అంటారు!”
“మొదటగా ఒక విషయం – నాకు పూజల మీద ఆసక్తి లేదు అని మాత్రమే అన్నాను. విగ్రహారాధన కూడా అంతే. నాస్తికత్వానికి, వాటికీ తేడా ఉంది.”
“సరే. ఇప్పుడేమిటంటావ్?”
” అంటే నువ్వు నమ్మే దేవుడికి నేను పూజ చేయకపోతే నేను నాస్తికురాలినా? ఈ లెక్కన నీకు క్రిశ్టియన్లు, ముస్లింలు వీళ్ళందరూ నాస్తికుల్లానే కనబడాలే?”
“అలా ఎలా అంటాను? వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ కున్నారు…”
“మరి నా దేవుళ్ళు నాకూ ఉన్నారు.”
“ఎవరు?”
“మీరే…”
“??”
“మానవత్వం ఏ కాస్త ఉన్న మనిషైనా దేవుడే. ఇంకో ప్రాణికి ఉపయోగపడే ఏ ప్రాణైనా దేవుడే. మనుష్యులకు ఉపయోగపడే వస్తువులు కూడా దేవుళ్ళే మరి (దేవుడు చేసిన దేవుళ్ళు అనాలేమో వీటిని…హీహీ)”
“అది వేరు…”
“అదే మరి. నాకు అది వేరు కాదు.”
“ఇంత మంది నమ్ముతున్నారు కదా….”
“నేను వాళ్ళనేమన్నా అన్నానా? నేను ఈ దేవుళ్ళను నమ్ముతా అంటున్నా. ఎవరి మతం వారిది..ఎవరి జీవితం వారిదీ”
- ఇక్కడ ఆగింది ఈరోజుకి.
నా మీద “సత్యమే శివం” ప్రభావం బాగా ఉంది అనడం లో ఏ మాత్రం సందేహం లేదు అనిపించింది ఈ చర్చ ను బట్టి. ఏమైనా, నేను ఒక దాన్ని నమ్ముతున్నాను. ఆ నమ్మకం ప్రకారమే జీవిస్తున్నాను. ఆ నమ్మకం తోనే జీవిస్తాను, ఏదో జరిగి నన్ను బలంగా కదిలించి నా మతం తప్పు అని నిరూపిస్తే చెప్పలేం కానీ. నా మతం వల్ల నా తోటి వారికి జరిగేది మేలే. నా మతం ఆచారాలు(??) నేను పాటిస్తూనే ఉన్నాను. మరి అలాంటప్పుడు నేను నాస్తికురాలినెట్లవుతా? అది కూడా నాకెక్కడా ఏ మతం మీదా ద్వేషం లేనప్పుడు….నాకు దేవుడు ఉన్నాడు అన్న దృఢమైన విశ్వాసం ఉన్నప్పుడు?
నాకు తెలిసిన సత్యమే నా శివం. అప్పుడు నాస్తికత్వానికి తావేదీ?
నాలుగోరోజు + నా భావాలు…
సెప్టెంబరు 20, 2007 at 3:04 అపరాహ్నం | In General | 3 Commentsనాలుగోరోజు…నిన్న నలుగురొస్తే…ఈరోజు ఏడుగురు. రోజు రోజుకీ సంఖ్య పెరగడం కాస్త ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి… ఈరోజు ఎందుకో గానీ… గత సంవత్సర కాలం లో ఈ పిల్లల తో గడపడం లో ముఖ్యమైన “గమనింపులు” ఏమన్నా ఉన్నాయా? అని ఆలోచించాను… బాగా striking గా కనబడ్డది ఏమిటంటే -
1. మునుపటి కంటే పిల్లలు బాగా తెలుగు చదువుతున్నారు
2. రెలేటివ్ గా లెక్కలు కూడా వేగంగానే చెబుతున్నారు
3. మునుపంత అల్లరి అల్లరి గా అనిపించడం లేదు
4. మునుపటి కంటే ఇప్పుడు దగ్గరైనట్లు అనిపిస్తోంది వారు నాకు
5. అప్పట్లా కొట్టుకోడం లేదు
- ఇవన్నీ ఎందుకు అనిపిస్తున్నాయంటే చెప్పలేను. వాళ్ళే మారారో…. వాళ్ళకి నేనే అలవాటు పడిపోయానో… లేక వాళ్ళు మారకపోయినా, ఇంకా ఫాం లోకి రాక అలా అల్లరి చేయకుండా ఉంటున్నారో… లేక నాబోటి వాళ్ళను చూసి జాలి పడ్డారో… నాకే సహనం,ఆప్టిమిజం పెరిగాయో….. నాకు మాత్రం ప్రస్తుతానికి అర్థం కావడం లేదు…. ఏదో ఒకటి వాళ్ళు మునుపటికంటే చురుగ్గా ఉన్నారు…. అది చాలు నాకు…. దానికి ఆషాకిరణ్ కారణం కాకపోయినా పర్వాలేదు.
అయి ఉంటే మాత్రం అది మేము సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం
ఒకానొకప్పుడు పోయినేడు ఈ టైం కి ఈ పిల్లల్నే చూసి పిల్ల రాక్షసుల్లా ఉన్నారు బాబోఇ అని నీరసించిన ఓ సాయంత్రం గుర్తు వచ్చి ఈ క్షణం లో కాస్త ఆశ్చర్యం – “ఈ పిల్లలేనా వాళ్ళు!” అని…. కాస్త చిర్నవ్వు…”ఆ నేనేనా నేను” అని….. “నిలువద్దము నిను ఎపుడైనా…నువు ఎవ్వరు అని అడిగేనా? ఆ చిత్రమె గమనిస్తున్నా కొత్తగా….” అని పాడుకోవాలనుంది
మళ్ళీ బడికి!
సెప్టెంబరు 20, 2007 at 3:24 పూర్వాహ్నం | In What do you say? | 7 Commentsమా ఆషాకిరణ్ స్కూల్ మళ్ళీ తెరుచుకుంది ఎట్టకేలకు బాలారిష్టాలన్నీ దాటుకుని. నిన్న మూడో రోజు. ఈ వానొకటి తగలడి వరుసగా – సున్నా,రెండు,నాలుగు మంది పిల్లలు ఈ మూడు రోజుల్లో. మళ్ళీ పిల్లల మధ్యకు… “మళ్ళీ బడికి” వెళ్ళడం ఆనందంగా ఉంది. ఈ టపా తో ఓ గేమ్ ని గురించి కొంచెం కారంగా, కొంచెం గారంగా చెప్పడం, మీనుంచి మీకు తెలిసిఉన్నచో పంచుకోవాల్సిన ఓ విషయం తెలుసుకోడం నా ముఖ్య ఉద్దేశ్యం.
నల్గురు పిల్లలు…ఇద్దరు జూనియర్ బ్యాచ్, మిగితా ఇద్దరు సీనియర్ బ్యాచ్. రెండు బ్యాచ్ లకీ రీడింగ్ సెషన్ ఈరోజు. కథలు. ఇదివరకటి కంటే వీళ్ళ Reading skills చాలానే అభివృద్ధి చెందాయి. మంచిదే. దీని ఆషాకిరణ్ కారణం అనేమీ చెప్పలేము. వాళ్ళు ఒక ఏడు పెద్దవారవడం కావొచ్చు, లేకుంటే వాళ్ళ సర్కారీ బళ్ళో నిజంగానే బాగా చెప్పారేమో ఈ మధ్య. ఏదైనా, నాకైతే ఆనందం కలిగింది వాళ్ళ performance కి. సరే, ఓ గంట అలా ఈ పుస్తక పఠనం అయ్యాక “అబాకస్” అని ఒక ఆట మొదలుపెట్టాం… నల్గురు పిల్లలు ఆట. మేము పక్కన చూడ్డం. ఇదేమో snakes & ladders తరహా ఆట. కాకుంటే ప్రతి డబ్బా లోనూ ఏదో లెక్కల సమస్యలు ఉంటాయి… నీ డైస్ పై ఉన్న సంఖ్యల మధ్య తేడాని రెండు తో గుణించి అన్ని గళ్ళు ముందుకు వెళ్ళు అనో, లేకుంటే.. నీ డైస్ పై ఉన్న సంఖ్య ల కూడిక పదైతే ఒక గడి ముందుకు, లేకుంటే మూడు గళ్ళు వెనక్కో..అలా ఏదో. ఒక విధంగా ఈ ఆట పిల్లలలు చాలా ఉపయోగకరం…mental math కోసం. అయితే, సమస్యల్లా ఏమిటీ అంటే – ఇది పూర్తి చేయాలంటే ఓ రోజు పడుతుంది కాబోలు. ఒక అడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కి వెళ్ళడం ఖాయం. ఆటన్నాక మరీ ఇంత పెస్సిమిస్టిక్ గా ఉంటే ఎలా? ప్రతి చోటా – “else move backward…” అన్న కండీషన్ వర్తించే అవకాశాలే ఎక్కువ. మొదట్లో కాసేపు ఇది కాస్త విసుగు పుట్టించింది కానీ, కాసేపయ్యేసరికి మునిగిపోయారు పిల్లలు అందులో. మళ్ళీ రేపు కూడా ఆడదాం అని చెప్పి దుకాణం కట్టేయాల్సి వచ్చింది.
ఈ ఆట ఆడించే క్రమం లో ఓ పెద్ద సమస్య భాష. ఆ ఆట లో గళ్ళపై అంతా ఆంగ్లం లో రాసి ఉండటం వల్ల పిల్లలు అర్థం చేసుకోలేకపోయారు. మేము పక్కనే కూర్చుని వాళ్ళకి ప్రతిసారీ వివరించాల్సి వచ్చింది. ఎటొచ్చీ వాళ్ళకి దీని వల్ల కూడా కొత్త పదాలు తెలిసాయి…అది వేరే విషయం. కానీ, నాకు తెలియాల్సింది ఏమిటీ అంటే – ఇలాంటి ఆటలు తెలుగు లో రాసి దొరుకుతాయా? అంటే గళ్ళలో అంగ్లం కాక తెలుగు. ఎక్కడా దొరక్కపోతే మేమే తయారు చేస్తాం ఏమో..చెప్పలేను కానీ, ఎంతైనా ఆ కంపెనీల బోర్డుల లుక్ రాదు కదా మేము తయారు చేసిన బోర్డు కి? అందుకని, తెలుగు లో రాసి ఉండేవి దొరికే అవకాశాలుంటే చెప్పండి… కొనుక్కుని ఆషాకిరణ్ కి ఉపయోగిస్తాం. పిల్లలకే ఇంగ్లీషు నేర్పుకోవచ్చు గానీ, వాళ్ళకి తెలుగే కాస్త ఇప్పుడిప్పుడు సరిగ్గా చదవడం, రాయడం వస్తోంది… కనుక కొన్నాళ్ళాగుదాం అని.
మీకు ఈ తెలుగు లో ఇంగ్లీషు ఆటలు (హాహా) ఎక్కడన్నా దొరికే చోటు తెలిస్తే ఇక్కడో కామెంటు రాయండి…
ఈ విషయం లో మీ మాట ఏమిటి?
సెప్టెంబరు 8, 2007 at 6:00 అపరాహ్నం | In What do you say? | 6 Commentsఈరోజు మళ్ళీ ఆ మూడో ప్రాజెక్టు మీద రెండో ఫీల్డ్ ట్రిప్. అర్థం కాలేదా? ఆషాకిరణ్ వి రెండు ప్రాజెక్టులు గా చూస్తాను నేను. (ఇది నాకు సంబంధించిన AK Activities మాత్రమే. మిగితా విషయాలున్నా నేను పట్టించుకోను) – స్కూల్, మెడికల్ క్యాంప్ లు. మూడోది మొన్న వెళ్ళిన ఫీల్డ్ ట్రిప్ కథ. కొందరు వ్యక్తులు పిల్లల చదువు కి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు అని చెప్పిన ట్రిప్ కి ఇది రెండో భాగం. ఇందులో ఓ చిన్న సందేహం ఉదయించింది నాలో. అది ఇక్కడ -
ఒక argument ఏమిటి అంటే – పనిలోకి వచ్చిన పిల్లల్ని మనం మళ్ళీ ఫుల్ టైం చదువులోకి దింపుతున్నప్పుడు ఆ చదువుకయ్యే డబ్బేకాక వాళ్ళ పని ద్వారా వచ్చే డబ్బు ను పోగొట్టుకుంటున్నారు కనుక అది కూడా మనమే ఇవ్వాలి అన్నది. నేనో పట్టాన దీన్ని ఒప్పుకోలేకపోతున్నా. అన్నీ మనమే ఇస్తే ఇక వాళ్ళు చేసేదేముంది అన్నది నా వాదన. వాదన కాదు లెండి…ఆలోచన. నేనేమీ మాట్లాడలేదు ఈ విషయం పై చర్చ జరుగుతున్నంత సేపు. ఊరికే వింటూ ఉన్నా. వాళ్ళకి మనం సాయం చేయాలి కానీ, ప్రతీదీ మనమే చేయడం అంత సబబు కాదేమో అనుకుంటున్నా. అంటే, వాళ్ళు చదువు మానేయడం లో మొదటి కారణం ఆ డబ్బే కానీ, మనం చదువుకే కాక జీవితావసరాలకు కూడా ఇవ్వాలా? అన్నది ప్రశ్న. మీరు ఏమంటారు? ఓ పక్క చదివిస్తున్నాం కదా, వాళ్ళ జీతం కూడా మనమే ఇచ్చుకోవడం అవసరమా? ఒక వేళ ఇచ్చామే అనుకోండి – అలా ఎంతమందికని ఇవ్వగలం? అసలది నాకైతే పర్సనల్ గా అంత మంచి ఆలోచనగా అనిపించడం లేదు. వాళ్ళ బాగు కోసం ఆలోచించినా కూడా వికటించే లా ఉంది ఈ ఆలోచన. మీ అభిప్రాయం ఏమిటి?
Happy Teachers Day!
సెప్టెంబరు 6, 2007 at 4:50 పూర్వాహ్నం | In People | 4 Commentsఒకరోజు ఆలస్యంగా అయినా కూడా నేను కొందరు చిన్ని గురువులకి టీచర్స్ డే శుభాకాంక్షలు వెబ్ముఖంగా చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ బ్లాగు ని చూస్తూ వచ్చిన వారెవరైనా వాళ్ళెవరో వెంటనే కనుక్కుంటారు అనుకుంటా. అదే… మా ఆషాకిరణ్ పిల్లలు. సాధారణంగా పిల్లలు టీచర్లకు విషస్ చెబుతారు. మరిక్కడ టీచరే పిల్లలకి ఎందుకు చెబుతోంది అంటే – నేను వాళ్ళకి పాఠాలు చెప్పడానికే వెళ్ళినా కూడా అక్కడినుండి గత సంవత్సర కాలం లో నేను నేర్చుకున్న పాఠాలు ఎన్నో! అందుకే నేనే వాళ్ళకి వెబ్ముఖంగా విష్ చేస్తున్నా
నేను ప్రస్తుతం ఇంట్లో ఉన్నా కనుక వాళ్ళకి పర్సనల్ గా చెప్పలేను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సెమెస్టర్ స్కూల్ నడవడం లేదు కనుక వాళ్ళని కలవనూ లేను. సో, మళ్ళీ ఈ హృదయభాను పోస్టు
నిజానికి, సరైన దృష్టి తో చూడాలే కానీ, ఎక్కడి నుంచి నేర్చుకోలేము? ఎవరి నుంచి నేర్చుకోలేము? సత్యమే శివం లో కమల్ హాసన్ ప్రతి మనిషి లో నూ దేవుడు ఉన్నాడు అన్నట్లు…. ప్రతి వస్తువు లోనూ టీచర్ ఉన్నాడు/ఉంది. ఈ విషయం నేనే కాక ఇంకెవరన్నా నాకు చెప్పుంటే మునుపైతే – “ఏదో చెప్తునారు.. మనటైప్ కాదు ఈ కహానీలు…” అనుకుని వదిలేసేదాన్ని కానీ, అందులోని నిజం ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నేను. టీచర్ అంటే స్కూల్లోనో, కాలేజీలోనో పాఠాలు చెప్పే వారు మాత్రమే కాదు. ఇంట్లో అమ్మ,నాన్న లు మొదలుకుని, మనల్ని ప్రభావితం చేసిన గొప్ప వాళ్ళు మొదలుకుని, ఈ క్షణం లో పరిచయమైన వ్యక్తి కూడా మనకు టీచర్ కిందే లెక్క. ఇక చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు – ఒకటనేముంది, అన్నీ ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి… ఈ సంధర్భం లోనే నా ఆటోగ్రాఫ్ సినిమాలోని – “మౌనంగా నే ఎదగమని…” పాట గుర్తువస్తోంది.
సరే, సోదాపి విషయం చెప్పాలి కదూ! ఏం నేర్చుకున్నాను ఆ పిల్లల దగ్గర్నుంచి? – అతి ముఖ్యమైనది – సహనం. వాళ్ళ దగ్గర్నుంచి నేర్చుకున్నది కాదు లెండి…వాళ్ళ వల్ల నేర్చుకున్నది. తరువాత, వాళ్ళ నుండి నేర్చుకున్నది – పడి లేవడం – వాళ్ళ లొ పడి లేవడం అంటే ఆటల్లో కింద పడ్డా కూడా దులుపుకుని లేచి ఆట కొనసాగించుకోడం…దెబ్బ గురించి ఆలోచిస్తూ ఉండకుండా. మరో విషయం – చిన్న చిన్న ఆనందాలను పుర్తిగా అనుభవించగలగడం. వాళ్ళ వల్లే నాకు తెలిసింది – టీచింగ్ అన్న కళ ఎలా ఉంటే వినేవాళ్ళకు చక్కగా ఉంటుందో అని. వాళ్ళ వల్ల కూడా నాకు తెలిసింది… ఏ బంధుత్వమూ, ఏ స్నేహమూ లేని బంధాలు కూడా అభిమానం, ఆప్యాయతలను పంచగలవు అని. నేనెక్కడ కనబడ్డా వాళ్ళు, వాళ్ళెక్కడ కనపడ్డా నేను – అభిమానంగా పలకరించుకోడం చూస్తూ ఉంటే. అన్నింటి కంటే ముఖ్యమైన్ది – ఈ పిల్లలతో, వాళ్ళ కుటుంబాలతో గడిపిన సమయమ్ చెప్పిన బ్రతుకు పాఠాలు – ఇంకెక్కడా దొరకని పాఠాలు అవి. మరిన్ని చెప్పిన వారిని టీచర్స్ డే నాడు ఓ సారి తలుచుకోవద్దూ? ఇదంతా పిల్లలకి ఎలాగో చెప్పను కనుక, ఎవరికో ఒకరికి చెప్ఫాలి కనుక, వెబ్ముఖంగా – మా ఆశాకిరణ్ పిల్లలకి టీచర్స్ డే శుభాకాంక్షలు – ఫ్రం one of their teachers
WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.