The story-telling effect

మార్చి 15, 2007 at 4:07 పూర్వాహ్నం | In General | 1 Comment

                    కథలంటే చాలా వరకు అందరికీ ఇష్టం గానే ఉంటుంది. పిల్లలకైతే మరీనూ. మొన్న ఓ రోజు నాకు ఈ విషయం మరో సారి అవగతమైంది. ఆషాకిరణ్ లో ఆ రోజు పిల్లలచేత చేయించాల్సిన exercises ఏమీ లేవు. దానితో కొన్ని కథల పుస్తకాలు ఉంటే వాటిని చదివించడం మొదలుపెట్టాము. పిల్లలు కూడా పెద్దగా లేరు. ఐదుగురే ఉన్నారు అనుకుంటా. వీరిలో ఒకడికి తెలుగు అక్షరాలు గుర్తు పట్టడమే తెలుసు కానీ, పదాలు చదవడం రాదు. చిన్నవాడు. కాబట్టి మొదట నేనేమో – “మీరు చదవండి. స్పష్టంగా చదవండి. ఎలాగంటే మీరు చదువుతూంటే ఈ అబ్బాయి కి అర్థం కావాలి” అని చెప్పాను మిగితా వారికి. వాళ్ళకి కూడా reading practice ఉంటుంది కదా అని. అయితే అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. :) వాళ్ళకూ చదవడం సరిగా రాదు. అలవాటు కూడా లేదు అనుకుంటా. ఇది వరలో చాలా సార్లు ఇలాంటి పుస్తకాలు చదివించాము కానీ, ఇక్కడ తప్ప వాళ్ళు ఆ తరహా readings చేయరో ఏమో కానీ, ఇంకా సమయం పడుతుంది వారు స్పష్టంగా చదవడానికి అని మాత్రం అర్థం అయింది.

సరే …. విషయానికొస్తే, వీళ్ళు ఇలా చదవడం తో ఆ చిన్న వాడికి ఆసక్తి పోయింది. అసహనం పెరిగింది. చివరకి – “నువ్వు చదవొచ్చు కద మేడం?” అన్నాడు. దానితో పెద్ద పిల్లలను ఇంకో వాలంటీరు చూస్తూ ఉంటే నేను వీడికి కథ చెప్పడానికి ఉపక్రమించాను. “కథ చదవొద్దు మేడం” – ముందే ultimatum ఇచ్చేసాడు. నాకు కథలు ఇంత చిన్న పిల్లలకి చెప్పడం …… ఇదే మొదలు అనుకుంటా. కొన్నాళ్ళ క్రితం నా చిన్న cousinsకి చెప్పినట్లు ఉన్నా కానీ, అప్పుడు నేనూ చిన్నదాన్నే. సరే, కథ చెప్పడం మొదలుపెట్టాను. ఐదు నిముషాల్లో మిగితా నలుగురు పిల్లలూ చుట్టూ చేరిపోయారు. వీడు చిన్న పిల్లవాడు కదా అని నేను కాస్త expressions ఇచ్చి చెప్పాను. దానితో ఆసక్తి కరంగా అనిపించినట్లు ఉంది. కథ అర్థం అయింది చివరికి. కథలోని హాస్యాన్ని వారు అర్థం చేసుకుని నవ్వుకున్నారు కూడా.

ఈ ఉదంతం లో నేను గమనించింది ఏమిటంటే – బాగా అల్లరి పిల్లలు, చెప్పిన మాట వినని వారు అని ముద్ర పడ్డ వాళ్ళు కూడా కథ చెబుతూంటే నోరుమూసుకుని, గొడవ చేయకుండా వినడం. అందరూ ఈ కథ వింటూ ఉండడం తో మరో వాలంటీరు కూడా ఓ పుస్తకం తీసి కథలు చదవడం మొదలుపెట్టాడు :) ఇదంతా తరువాత నా స్నేహితురాలికి చెబుతూ ఉంటే – తను కూడా అనింది. “కథలు బాగున్నాయి. మొన్నామధ్య నేనూ వాళ్ళతో కథలు చదవడం మొదలుపెట్టా” అని. “కథా మహిమ!” అనుకున్నా. మొత్తానికైతే పిల్లల్ని ఊరుకోబెట్టే అస్త్రం ఇది. చిన్నప్పుడు కథ చెప్పమని జనాలను వేధించేదాన్ని నేను. ఇప్పటికీ కథలంటే చెవికోసుకుంటాను అనుకోండి. అది గుర్తు వచ్చింది ఎందుకో గానీ! :)

Desamuduru generation

మార్చి 6, 2007 at 1:31 అపరాహ్నం | In General | 3 Comments

                ఈమధ్య పిల్లలు మాట్లాడే మాటలూ, పాడే పాటలూ ఉన్నాయి చూసారూ ….. ఆఖరికి నాక్కూడా : “మా కాలం లో అయితేనా?” – అని నోరు, చేతులు తిప్పుతూ మాట్లాడాలనిపిస్తుంది ఏ సూర్యకాంతం లానో, ఛాయాదేవి లానో.

ఇందాక ఆషాకిరణ్ లో చదువుల session అయిపోయి వెళ్ళిపోయే ముందు food session మొదలైంది. ఈరోజు 5 మందే వచ్చారు. మామూలుగా 10-15 మందికి తక్కువ రారు. దానితో ఒక్కోళ్ళకి ఎక్కువ quantity వచ్చింది. అరటిపళ్ళూ, papaya నూ. అయితే ఒకడు ఇంకోడి తో అంటున్నాడు -  ” ఒరేయ్, ఈరోజు ఎందుకు ఇన్ని ఇచ్చారో తెలుసా? మిగితా వాళ్ళు రాలేదు కదా…. అందుకని.” అని.  పిల్లలు బాగా తెలివిమీరి పోయారు అని మనసులో అనుకుని పైకి ఓ నవ్వు మాత్రం నవ్వాను.

రోడ్డు దాటించడానికి పిల్లలని తీసుకెళ్తూ ఉంటే ఎవరో ఒక అబ్బాయి లోపలికి వస్తున్నాడు. మా కాలేజీ విద్యార్థి. అతన్ని చూపిస్తూ మా పిల్లల్లో ఒక అబ్బాయి అన్నాడు – ” టీచర్, ఈ అబ్బాయి తో కలిసి ఎప్పుడూ ఒక అమ్మాయి ఉంటుంది. వీళ్ళిద్దరూ భలే వెరైటీ గా మాట్లాడతారు టీచర్” అని! ఇంక అప్పుడు నా మొహం చూసుంటే – టైడ్ డిటర్జెంట్ వాడు వెంటనే కెమెరా పట్టుకుని నన్ను చూపిస్తూ వ్యాఖ్యానం మొదలుపెట్టేవాడు – ” అవ్వాక్కయ్యారా?” అంటూ! ఆ అబ్బాయి ని చూడగానే నాకూ ఆ అమ్మాయే గుర్తు వస్తుంది కానీ, (;)) పిల్లలు కూడా అంత బాగా గమనించి ఉంటారని ఊహించలేదు.

ఈ మధ్య ఈ చిన్న పిల్లల బ్యాచ్ అంతా మరీ తెలివి మీరి పోతున్నారు అసలు! బంధువుల ఇళ్ళలో పిల్లలనూ, ఇక్కడ వీళ్ళనూ చూస్తూ ఉంటే ఈ విషయం బాగా తెలుస్తోంది.

Where teachers fear students

మార్చి 3, 2007 at 3:11 పూర్వాహ్నం | In People | 3 Comments

ఆ మధ్య ఓ రోజు శాంతి మేడమో ఎవరో ఒక పిల్లాడికి బండి లో అమ్మే పానీపూరీలు అవీ ఇవీ అన్నీ తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పారంట. అప్పుడు నేను లేను. నా స్నేహితురాలు ఉంది. ఆ మాట వినగానే ఆ పిల్లాడు వెంటనే నా స్నేహితురాలిని చూపించి – “ఈ టీచర్ కూడా తింటుంది అక్కడ” – అని accusative Tone లో చెప్పాడట! కాసేపటికి నేను వెళ్ళాను. నా స్నేహితురాలు నాతో ఇది అంతా చెప్పింది. ఇద్దరికీ నవ్వు వచ్చింది. నేను ఏదో ఒకటి అనాలని వాడిని పిలిచి – “నువ్వెప్పుడు చూసావు రా?” అని అడిగా. ” ఆ రోజు నువ్వు కూడా ఉన్నావ్ టీచర్ అక్కడ” – అన్నాడు. ఇంక చూడాలి నా మొహాన్ని! నేను, నా నేస్తం ఇద్దరం చాలా నవ్వుకున్నాం. దెబ్బకి చాలా రోజుల దాకా నేను ఆ బండి జోలికి పోలేదు. మొన్నో రోజు ఓ ఫ్రెండు బలవంతం మీద వెళ్ళా. అదీ చుట్టుపక్కల చూసుకుని!

ఇంకో స్నేహితుడి అనుభవం: అతడికి సిగరెట్ అలవాటుంది. ఉన్నట్లుండి ఓ రోజు ఆషాకిరణ్ లో ఒక అమ్మాయి ని చూసి షాక్ తిన్నట్లు మొహం పెట్టాడు. ఎందుకని అడిగితే అసలు సంగతి చెప్పాడు. ఇతను సిగరెట్లు కొనే బండి ఆ అమ్మాయి నాన్నదంట! దానితో అన్నాడు – ” ఇంక నుంచి వేరే ఏదో బండి వెదుక్కోవాల్సిందే!” అని :)

ఆ మధ్య ఓ రోజు పిల్లలతో అవుట్ చేసుకునే ఆట ఆడుతూ అత్యుత్సాహం లో జారి పడ్డాను. అనుకోకుండా తరువాతి రోజు కూడా స్కూలు కి నేనే వెళ్ళాను. దెబ్బలు కనిపిస్తే ప్రశ్నలతో చంపేస్తారని ఫుల్-షర్టు వేసుకుని వెళ్ళాను. “ఏం టీచర్, చలేస్తోందా నీకు ఈ టైము కి?” “ఏం టీచర్, మళ్ళీ ఆడతావా మాతో?” (ఒకరిద్దరి ముసి ముసి నవ్వులు), “టీచర్, నిన్న దెబ్బ ఎక్కువ తగిలిందా టీచర్?” – concern. “టీచర్, నొప్పిగా ఉందా టీచర్?” – మరో సారి concern : ఇలా రకరకాల ప్రశ్నలతో దాడి చేసారు నా మీద :) కొన్ని ప్రశ్నలకు కాస్త embarassing గానూ, కొన్నింటికి వీళ్ళ శ్రద్ధ కు ఆనందంగానూ ఉండింది. కానీ, ఇంకో సారి ఫీట్లు చేసేటప్పుడు, అదీ వీళ్ళతో చేసేటప్పుడు కాస్త జాగ్రత్త గా ఉండాలి అని అర్థమైంది. లేకుంటే book అయినట్లే ఇంక. leg-pulling మొదలైంది అంటే ఆగదు – ఎక్కడైనా.. ఎవరినీ వదలకుండా satires వేసే నేను వాళ్ళ ప్రశ్నలకు మూగదాన్ని అయ్యాను!

టీచర్లకు పిల్లలే కాదు. పిల్లలకి టీచర్లు కూడా భయపడతారు! :)

Management lessons from AshaKiran kids

మార్చి 2, 2007 at 3:58 పూర్వాహ్నం | In Incidents | 9 Comments

నాకీమధ్య ఓ సందేహం వచ్చింది. పిల్లలకి చదువు చెప్పే సమయం లో కాస్త కఠినంగానే వ్యవహరించాలేమో అని. ఇదివరలో అంత తెలిసేది కాదు కానీ, ఇప్పుడు బాగా తెలుస్తోంది ఈ విషయం. ఓ రెణ్ణెళ్ళ క్రితం వరకు పిల్లలు బానే ఉండేవారు. గొడవ చేయకు అంటే చాలా మటుకు ఆపేవారు. చెట్లు ఎక్కకు, పడతావు అంటే వినేవారే ఎక్కువ…ఇంకా పైకి ఎక్కేవారికన్నా : అప్పట్లో.

కొత్త సంవత్సరం మొదలయ్యాక వీరి ఆగడాలు బాగా ఎక్కువైపోయినట్లు నాకు అనుమానం. మెట్లు లేని మేడ పైకి గోడ లోని కన్నాల సాయం తో ఎక్కే ప్రయత్నాలు చేయడం ఒకటి – ఎంత risky పనో ఎంత చెప్పినా అర్థం కాలేదు. తరువాత కొన్నాళ్ళకు ఆ బిల్డింగ్ వాచ్మెన్ కి భయపడో ఏమో మరి మానేశారనుకోండి. అది వేరే విషయం. ఒకళ్ళనొకళ్ళు పరుష పదజాలం తో దూషించుకోవడం, మరీ విపరీతంగా కొట్టుకోవడం, సందు చిక్కితే పిలిచినా వినిపించుకోకుండా చెట్లు ఎక్కడం, కొమ్మలు తెంపేయడం – ఇవి Latest developments. పిల్లలతో మెత్తగా ఉంటూనే  వారికి మంచి చెప్పొచ్చు అని అనుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళు. కానీ, మొన్న మా AK స్కూలు అమ్మాయి లలిత తన స్నేహితురాలు సంధ్య తో : “ఆ టీచర్ ఊరికే అట్ల చెబుతుంది అంతే. ఏమీ అనదు లే” అని నా గురించి నా ముందే చెబుతూంటే అనిపించింది – నేను మరీ మెతగ్గా వ్యవహరిస్తున్నానేమో వీరితో అని.

బెదిరింపు ఒక మార్గం. ఇలా చేస్తే ఫలానా వారికి చెప్తాను అని. మొన్నో రోజు నేను ఎవరికో ఫోను చేస్తూ ఉంటే వీళ్ళకి కాస్త భయం, భక్తి ఉన్న సత్య సార్ కి చేస్తున్నా ఏమో అనుకుని పిల్లలందరూ సైలెంటైపోయారు. కాసేపు ప్రశాంతత అలుముకుంది. అందరూ కూర్చుని ఇచ్చిన చిన్న చిన్న exercises చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా నాకే ఉద్ధేశ్యం లేకున్నా కూడా బెదిరించినట్లైంది.

కాస్త గట్టిగా చెప్పడం చాలా అవసరం అని అర్థం కావడానికి ఇన్నాళ్ళు పట్టింది నాకు, బెదిరింపు సంగతి అటు పక్కన పెడితే. మెతగ్గా ఉంటే ఎవరూ వినరు. నీ మాట అవతలి వాళ్ళని చేరాలంటే “aggressive గా ఉండు అనుకుంటూ management principle ఒకటి కనిపెట్టాను :) ప్రథమ యత్నం గా – “చూడు బాబూ, గొడవ చెయ్యడానికే అయితే ఇక్కడకు రాకు. నువ్వు వెళ్ళిపోయినా నేను ఏమీ అనను. ఎవరికీ ఫిర్యాదు చెయ్యను. వెళ్ళు. రెపట్నుంచి రాకు” -బాగా నస పెడుతున్న ఒకడికి చెప్పి చూసాను. కాస్త ఫలితం ఉండింది. అక్కడికీ గట్టిగా చెప్పలేకపోయాను. చిన్నపిల్లల్లే అన్న soft-corner తో.

అయినా స్కూల్లో టీచర్లలా కర్రలు పట్టుకుని చెబితే గానీ వినరో ఏం కథో ఈ పిల్లలు. ఆ మధ్య “మీ స్కూల్ లో కూడా ఇలాగే చేస్తావా రా?” అని ఒకడిని అడిగితే “ఇట్లెందుకు చేస్తా? సారు కొడతాడు” అని జవాబిచ్చాడు!!!!! అంటే కొట్టము-తిట్టము కాబట్టి మాతో ఏమన్నా చేయొచ్చు అన్నమాట! కాస్త 2,3 ఏళ్ళుగా వస్తున్న లిని, సత్య లాంటి వాలంటీర్లకు పిల్లలు కాస్త భయపడతారు. అలవాటు కాబట్టి ఊరుకుంటారో! 4,5 నెలలు గా వస్తున్న నాబోటి వారికి వాళ్ళు ఇంకా అంత అలవాటు పడకపోవడం మాట వినకపోవడానికి ఓ కారణం కావొచ్చు. ఏది ఏమైనా  నేను ఇంత మంది అధ్యాపకుల మధ్య ఏ బీస్కూలూ చెప్పలేనన్ని మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకుంటున్నా. అది మాత్రం నిజం!

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.