Reality tastes bitter

జనవరి 19, 2007 at 5:55 అపరాహ్నం | In Incidents | Leave a Comment

నిన్నటి ఆషాకిరణ్ క్లాసులో ఓ కొత్త పిల్లాడు కనిపించాడు. వాడు నిజంగా కొత్తవాడో లేక నేను వచ్చిన రోజుల్లో రాని irregular పిల్లవాడో ;) తెలియక నా పక్కన కూర్చున్న అబ్బాయిని అడిగి కనుక్కున్నా. కొత్త అబ్బాయంట. సరే అనుకుని పలకరించా … నీ పేరేంటి అంటూ. చెప్పాడు. చూట్టానికి ఒ 12 ఏళ్ళ పిల్లవాడిలా ఉన్నాడు. ఎంతవరకూ చదువుకున్నావ్ అంటే ఇప్పటిదాకా బడికే పోలేదు అనిచెప్పాడు. పోనీ అక్షరాలు వచ్చా అంటే రావన్నాడు. వీడికి మనం మొదటి నుంచీ మొదలెట్టాలి అన్న విషయం మాత్రం అర్థమైంది నాకు. మిగితా వాళ్ళతో పాటు వాడు కూడా కూర్చుని ఉన్నాడు. ఉన్న వాలంటీర్లలో ఎవరో వాడి బాధ్యత తీసుకున్నారు. కానీ, వీడు చాలా అల్లరి గా ఉన్నాడు. బాల రౌడీ లాగా అనిపించాడు. :)

కాసేపటి తరువాత పిల్లల్లో ఒకరెవరో అన్నారు – మహేష్ సిగరెట్టు కాలుస్తాడు అని. నిజమా? అన్నట్లు వాడి వైపు చూస్తే నిజమే అన్నాడు వాడు! ఆ పిల్లల్లో పెద్దవాడిలా అనిపించినా కూడా వాడికి ఓ 12 ఏళ్ళు ఉంటాయేమో అంతే. వాడు ఆ విషయాన్ని చెప్పడం లో సిగ్గుపడ్డం లాంటివి ఏమీ జరగలేదు. నవ్వుతూ అదేదో సాధారణ విషయం అయినట్లు చెప్పాడు. అది గాక జర్దా కూడా అలవాటంట వాడికి !!! ఎలా అలవాటయింది అని అడిగితే ఇంట్లో వాళ్ళు తాగుతూంటే అలవాటయింది అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు ఏమీ అనలేదా అంటే వాళ్ళు చాలా సార్లు కొట్టారని చెప్పాడు. అయినా వీడు మారలేదు అన్నమాట.

ఈ వయసుకే అలాంటి అలవాట్లు వచ్చేస్తే వాడి ఆరోగ్యం వాడు పెద్దవాడయ్యే సరికి ఎలాగౌతుందో తలుచుకుంటేనే భయమేసింది. వాడికి నాబోటి వారు చెబితే ఎలాగూ వినడు. శాంతి మేడం ఈ అలవాట్ల వల్ల ఆరోగ్యం పాడవడం గురించి ఓపిగ్గా చెప్పారు. వాడు విన్నాడా అన్నది నాకు అనుమానమే. వాడి వాలకం చూస్తే ఎవరికో చెప్తే వింత చూస్తున్నట్లు ఉండింది.

ఈ వయసు పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్పడం ఎంత అవసరమో నాకు అప్పటికి గానీ అర్థం కాలేదు. కానీ, వాళ్ళకి చెప్పేవారెవరు? చెప్పాల్సినవాళ్ళు స్వయానా ఈ అలవాట్లకు బానిసలయ్యే అవకాశాలే ఎక్కువ. అలాంటప్పుడు వాడికి వాడు చేసే పని అంత మంచిది కాదు అని చెప్పేదెవరు? వీడికి అయితే వాడికి విసుగొచ్చేదాకా చెప్పడానికి ఆషాకిరణ్ ఉంది. మిగితావారికో? పిల్లల కోసం పని చేసే సంస్థలు ఈ విషయం పై కూడా తగిన స్రద్ధ తీసుకోవాలి అనుకుంటా. చదువు కీ, కూడూ గుడ్డలకి facilitate చేయ్యడం ఒక ఎత్తు. ఈ తరహా విషయాలు ఒక ఎత్తు. Lets hope for a better future for all kids!

WordPress.com లో Blog పెట్టుము. | Theme: Pool by Borja Fernandez.
Entries and comments feeds.